: ఆ రోజున జీఎస్టీని మోదీ వ్యతిరేకించిన మాట వాస్తవమే!: వెంకయ్యనాయుడు

గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం జీఎస్టీని నరేంద్ర మోదీ వ్యతిరేకించిన మాట వాస్తవమేనని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఢిల్లీలో ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, జీఎస్టీపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రధాని మోదీకి ఎక్కడ మంచి పేరు వస్తుందోనని ప్రతిపక్షాలు భయపడుతున్నాయని విమర్శించారు. జీఎస్టీని ఏ రాజకీయ పార్టీ వ్యతిరేకించడం లేదని, కాంగ్రెస్ పార్టీ, వామపక్షాలు కూడా జీఎస్టీని వ్యతిరేకించడం లేదని అన్నారు. ప్రపంచంలో 142 దేశాలు జీఎస్టీని అమలు చేస్తున్నాయని ఈ సందర్భంగా వెంకయ్య గుర్తుచేశారు. జీఎస్టీపై కాంగ్రెస్ నాయకులు ఇష్టానుసారం మాట్లాడి చులకన అవుతున్నారని అన్నారు.

More Telugu News