: 1962 నాటి భారత్... ఇప్పటి భారత్... వేర్వేరు.. తెలుసుకోండి!: చైనాకు అరుణ్ జైట్లీ హెచ్చరిక
`చరిత్ర చూసుకుని ముందడుగు వేయండి` అని గురువారం రోజు చైనా పలికిన మాటలకు భారత రక్షణ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గట్టిగానే జవాబిచ్చారు. చరిత్రలో ఉన్న భారత్, ఇప్పటి భారత్ వేర్వేరని చైనాకు గుర్తుచేశారు. సిక్కింలో ప్రవేశిస్తున్న వారి దళాలను అడ్డుకున్నందుకు చైనా '1962లో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయండి, లేదంటే మమ్మల్ని ముందుకు రానీయండి' అంటూ భారత సైన్యాన్ని హెచ్చరించింది.
ఈ విషయంపై అరుణ్ జైట్లీ స్పందిస్తూ - `1962 సంగతి గుర్తుచేశారుగా... అప్పుడున్న భారత్ ఇప్పుడున్న భారత్ వేర్వేరు అనే విషయం మీరు కూడా గుర్తుతెచ్చుకోండి` అన్నారు. తమ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నట్టు ఇప్పటికే భూటాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనను జైట్లీ వక్కాణించారు. ఇలా పక్క దేశాల భూభాగాలను ఆక్రమించడం ఎంత మాత్రం తగదని జైట్లీ చెప్పారు. భారత్‌ను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే డోఖలా ప్రాంతంలోని సిలిగురి కారిడార్ తమ సైన్య సౌకర్యార్థం సిక్కిం-భూటాన్-టిబెట్‌లను కలుపుతూ చైనా మార్గం నిర్మించాలనుకుంటోంది. వివాదాస్పద ప్రాంతంలో మార్గం నిర్మించే ప్రయత్నాలను భారత ఆర్మీ అడ్డుకుంది.జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 3,488 కి.మీ.ల మేర చైనాతో భారత్‌కు ఉన్న సరిహద్దులో 220 కి.మీ.లు సిక్కింలోనే ఉంది.