: చంద్రబాబునాయుడు.. ఆయమ్మ అఖిల ప్రియకు పెద్ద బాధ్యత పెట్టినాడు: బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
ఏపీ యువ మంత్రి, టీడీపీ నేత అఖిలప్రియ, వైఎస్సార్సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డి లపై రాయలసీమ రాష్ట్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విమర్శలు గుప్పించారు. ‘అఖిలప్రియ గారిని అడుగుతున్నాను, మీరు ఏ పార్టీ? నిజంగా మీరు తెలుగుదేశం పార్టీనా? ఏమయ్యా మోహన్ రెడ్డీ.. నువ్వు నిజంగా వైఎస్సార్ పార్టీనా? ఏదీ నిజంకాదు. రేపొద్దున్న ఆ జెండా ఆడ పారేస్తారు..ఒక షేర్ మార్కెట్ మాదిరి అయిపోయింది. ఆయమ్మ అఖిల ప్రియకు చాలా పెద్ద బాధ్యత పెట్టిండ్రు చంద్రబాబునాయుడుగారు. ఆయమ్మకేమో పాపం..సన్న పాపకు పెద్దగౌన్ తొడిగినాడు. రాష్ట్రం విడిపోయిన తర్వాత చిన్నరాష్ట్రం అయింది ఇది. చంద్రబాబునాయుడేమో నేషనల్ లీడర్ ఆయన, జాతీయస్థాయిలో చక్రం తిప్పేస్తున్నాడు. ఆయనేమో పెద్ద పాప..చిన్నగౌన్ తొడుక్కున్నాడు. ఈరకంగా తయారైంది ఈడ.
ఇక, జగన్ బాబు మొన్ననే మోదీ కాడకు పోయి చెవులో గుసగుసలాడి వచ్చినాడు... ఒకరిని మించి ఒకరు. ఈరోజు చంద్రబాబునాయుడు పొద్దున ఫ్లైట్ కు పోతే, సాయంత్రం ఫ్లైట్ కు జగన్ మోదీ వద్దకు వెళుతున్నారు. అంతా, మోదీ జపంలో పడిపోయినారు.. ఈరోజు ఇద్దరూఇద్దరే. శిల్పామోహన్ రెడ్డి గారికి ఏం అర్హత ఉందని వైఎస్సార్సీపీ టికెట్ ఇచ్చినారు జగన్ గారు? పార్టీ పెద్దలు కాబట్టి టికెట్ ఇచ్చే అధికారం ఉంది. కానీ, శిల్పామోహన్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారో ప్రజలకు వివరించాలి. ఈ నంద్యాలలో శిల్పామోహన్ రెడ్డి ఫలానా సేవలు చేశాడనా? ఆయన రాయలసీమను బాగు చేస్తాడనా?.. మోహన్ రెడ్డికి ఎందుకు టికెట్ ఇచ్చారు? బాగా పార్టీలు మారాడనా? లేకపోతే సూట్ కేసుల నిండా డబ్బులు తెచ్చాడనా?’ అంటూ బైరెడ్డి విమర్శించారు.