: జీఎస్టీ వల్ల మందుల కొరత?
జూలై 1 నుంచి అమలుకానున్న వస్తు సేవల పన్ను దెబ్బ ఫార్మా కంపెనీలపై పడనుంది. దీని వల్ల జీఎస్టీ అమలయ్యాక కొద్ది రోజుల పాటు మందుల కొరత ఉంటుందేమోనని మందుల వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. జీఎస్టీ గెజిట్‌లో మందులపై పొందుపరిచిన కొత్త పన్ను విధానానికి మారడంలో కొంత సమయం పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మరోవైపు జీఎస్టీ వల్ల ఏర్పడనున్న కొరతను వీలైనంత మేరకు తీరుస్తామని, కావలసిన మందులను సకాలంలో అందజేస్తామని ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ వారు ప్రభుత్వానికి హామీ ఇచ్చారు.
పట్టణాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ కొరత ప్రభావం ఎక్కువ కనిపించవచ్చని, చాలా మంది చిల్లర వ్యాపారులు ఇంకా జీఎస్టీ నెంబర్ కూడా తీసుకోలేదని అభిప్రాయపడుతున్నారు. మందుల కొరత రాకుండా కంపెనీలు, రిటైలర్లు సమన్వయంతో పనిచేయాలని వారు సూచిస్తున్నారు. ప్రస్తుతానికి మధుమేహం, జీర్ణక్రియ వ్యాధులకు సంబంధించిన అత్యవసర మందులు 22 రోజులకు సరిపడా ఉన్నాయని, ఆలోగా కొత్త పన్ను విధానానికి అలవాటు పడి కొరత లేకుండా చూస్తామని ఆర్గనైజేషన్ చెబుతోంది.
జీఎస్‌టీతో అన్ని రకాల మందులపై 12 శాతం పన్ను పడనుంది. అలాగే ఇన్సులిన్ లాంటి ముఖ్యమైన మందులపై 5 శాతం పన్ను భారం పడనుంది. వివిధ మందులకు సంబంధించిన కొత్త ధరల జాబితాను జాతీయ మందుల ధరల నిర్ణయ సంస్థ విడుదల చేసింది.