: గరగపర్రుకు బయలుదేరిన వైఎస్ జగన్... టెన్షన్ టెన్షన్!
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను పరామర్శించేందుకు నేడు వైకాపా అధినేత వైఎస్ జగన్ వెళ్లనుండటంతో, ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఈ ప్రాంతంలో నెలకొన్న టెన్షన్ దృష్ట్యా, కేవలం గ్రామానికి చెందిన వారికి మాత్రమే, అది కూడా గుర్తింపు కార్డు చూపిస్తేనే లోపలికి అనుమతిస్తున్నారు. వైకాపా కార్యకర్తలను గ్రామంలోకి వెళ్లనీయడం లేదు.
కాగా, ఈ ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడకు విమానంలో చేరుకున్న జగన్ కు ఎమ్మెల్యే కొడాలి నాని, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, వైకాపా నేతలు వంగవీటి రాధ, మేరుగ నాగార్జున తదితరులు ఘన స్వాగతం పలికారు. ఆయన తాడేపల్లిగూడెం, పిప్పర మీదుగా రోడ్డు మార్గాన గరగపర్రుకు బయలుదేరారు. ఈ ఉదయం 11 గంటల తరువాత ఆయన గ్రామానికి చేరుకుని దళితులతో మాట్లాడనున్నారు.