: మోదీ, ట్రంప్ ల మధ్య సాన్నిహిత్యం పెరిగింది... నిజమైన మిత్రుడిగా ట్రంప్ మారారు: చైనా మీడియా
మోదీ అమెరికా పర్యటన, ట్రంప్ తో బలపడుతున్న సాన్నిహిత్యంపై చైనా అధికారిక మీడియా విశ్లేషణ చేస్తోంది. భారత్, అమెరికా అధినేతల మధ్య సాన్నిహిత్యం పెరిగిందని... మోదీకి ట్రంప్ నిజమైన స్నేహితుడిగా మారారని తెలిపింది. ఈ నేపథ్యంలో, ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడనున్నాయని విశ్లేషించింది. దీని వలన భారత్ కు చాలా ప్రయోజనం చేకూరనుందని అభిప్రాయపడింది. అంతర్జాతీయంగా ఉగ్రవాదాన్ని అరికట్టడంలో ఇరు దేశాలు కలసి కీలక పాత్రను పోషించబోతున్నాయని పేర్కొంది. ముంబై, పఠాన్ కోట్ తదితర ప్రాంతాల్లో చోటు చేసుకున్న ఉగ్రదాడులకు పాకిస్థాన్ దే బాధ్యత అనే విషయాన్ని అమెరికా గుర్తించిందని చెప్పింది. మోదీ, ట్రంప్ ల కలయికను చూస్తుంటే... 'మేకిన్ ఇండియా'లా కాకుండా 'అమెరికా ఫస్ట్' అనే విధంగా ఉందని కూడా దెప్పిపొడిచింది.