: మనీలాండరింగ్ కేసు విచారణకు హాజరు కావాలంటూ పాక్ ప్రధాని కుమార్తెకు సమన్లు


మనీలాండరింగ్ కేసులో ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ కు జాయింట్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (జేఐటీ) సమన్లు జారీ చేసింది. ఈ కేసు విచారణ నిమిత్తం జులై 5వ తేదీన విచారణకు రావాల్సిందిగా ఆదేశించింది. కాగా, నవాజ్ షరీఫ్ ఇద్దరు కుమారులు హసన్, హుస్సేన్ లు కూడా జులై 3,4 తేదీల్లో జేఐటీ ఎదుట విచారణ నిమిత్తం హాజరుకావాల్సి ఉంది. పెద్ద కుమారుడు హసన్ ను ఇప్పటికే ఐదుసార్లు జేఐటీ విచారించింది. వీరితోపాటు, నవాజ్ షరీఫ్ బంధువు తారిఖ్ షఫీని కూడా జులై 10న విచారణకు హాజరుకావాలని జేఐటీ సమన్లు జారీ చేసింది.

 కాగా, మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు అక్రమంగా తరలించిన డబ్బుతో నవాజ్ షరీఫ్ కుటుంబం లండన్ లోని పార్క్ లేన్ ప్రాంతంలో నాలుగు అపార్టుమెంట్లు కొనుగోలు చేసినట్టు పనామా పత్రాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 20వ తేదీన ఈ కేసు విచారణను పాకిస్థాన్ సుప్రీంకోర్టు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే నవాజ్ షరీఫ్ సహా వారి కుటుంబసభ్యులను జేఐటీ విచారణ చేస్తోంది. ఈ కేసు విచారణ నిమిత్తం ఈ నెల 15న నవాజ్ షరీఫ్ కూడా జేఐటీ ఎదుట హాజరయ్యారు. ఈ కేసుకు సంబంధించిన విచారణా నివేదికను జులై 10న సుప్రీంకోర్టుకు జేఐటీ సమర్పించాల్సి ఉంది. ఇదిలా ఉండగా, నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం లండన్ లో చదువుకుంటున్నారు. యూనివర్శిటీ స్నాతకోత్సవం నిమిత్తం ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నారు.  

  • Loading...

More Telugu News