: ట్రంప్ ట్రావెల్ బ్యాన్ కు పాక్షిక విజయం... కొన్ని మార్గదర్శకాలతో సుప్రీం అంగీకారం


ఆరు ముస్లిం దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు సుప్రీంకోర్టులో పాక్షిక విజయం లభించింది. ఇరాన్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్‌ దేశాల నుంచి వచ్చేవారిపై ట్రంప్ ట్రావెల్ బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిషేధాన్ని కింది కోర్టులు కొట్టివేశాయి. అది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమేనని పేర్కొన్నాయి. దీంతో ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లెక్కింది. ఈ నేపథ్యంలో విచారించిన సుప్రీంకోర్టు కింది కోర్టులు ఇచ్చిన నిలిపివేత ఉత్తర్వులను ఎత్తివేసింది. ట్రంప్‌ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను అమల్లోకి తెచ్చేందుకు అనుమతించాలంటూ వైట్‌హౌస్‌ వర్గాలు చేసిన విజ్ఞప్తికి పచ్చజెండా ఊపింది.

అయితే.. అమెరికాలో ఉన్న తమ బంధువులను చూసేందుకు లేదా దేశంలోని సంస్థలతో సంబంధం ఉన్నట్టు నిర్ధారించే ధ్రువీకృత పత్రాలతో వచ్చేవారిని మాత్రం అడ్డుకోకూడదని స్పష్టం చేసింది. (అంటే... అమెరికాలో ఉన్న తమ కుటుంబసభ్యులను చూసేందుకు లేదా వారితో కలిసి నివసించేందుకు వచ్చేవారిని, అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకోవడానికి వచ్చే విద్యార్థులను, అమెరికా కంపెనీలో పనిచేసే ఉద్యోగులను, అమెరికా విద్యాసంస్థల నుంచి ఆహ్వానం అందుకున్న అధ్యాపకుల వంటివారిని రానివ్వాలని తీర్పులో స్పష్టంగా సూచించింది.). అవి లేని విదేశీయులని నిలిపివేయవచ్చని స్పష్టం చేసింది.

శరణార్థులపై 120 రోజుల నిషేధాన్ని కూడా సుప్రీంకోర్టు ఆమోదించింది. (అంటే...అమెరికాలోని వ్యక్తులు, సంస్థలతో ఎలాంటి సంబంధమూ లేని శరణార్థులు 120 రోజులపాటు అమెరికాలోకి అడుగుపెట్టడానికి వీల్లేదు). దీంతో ఈ ఆరుదేశాలకు చెందిన పౌరులకు అమెరికాతో చట్టపరమైన సంబంధం లేని పక్షంలో అమెరికాలో కాలుమోపడానికి వీల్లేదు. కాగా, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 72 గంటల తరువాత అంటే జూన్ 29 నుంచి దీనిని అమలు చేస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు. దీంతో అమెరికాతో చట్టబద్ధమైన సంబంధం లేని వారు అమెరికాలో ఉండేందుకు వీలు కాదు.

  • Loading...

More Telugu News