: రవితేజ సోదరుడు భరత్ మద్యం సేవిస్తున్న దృశ్యాలు నోవాటెల్ సీసీ కెమెరాలో రికార్డు!
ప్రముఖ సినీ నటుడు రవితేజ సోదరుడు భరత్ రాజు ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం, ఆయన అంత్యక్రియలు నిన్న ముగియడం తెలిసిందే. మద్యం సేవించడం, అతి వేగంగా కారు నడపడంతోనే భరత్ కారు ప్రమాదానికి గురైనట్టు పోలీసులు పేర్కొనడం విదితమే. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదానికి ముందు భరత్, నోవాటెల్ హోటల్ లో గడిపిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి.
‘నోవాటెల్’లో శనివారం జరిగిన తన స్నేహితుడి పుట్టినరోజు పార్టీకి భరత్ హాజరయ్యాడు. సాయంత్రం నాలుగు గంటలకు స్విమ్మింగ్ పూల్ వద్ద ఆయన మద్యం సేవించినట్టు సీసీ కెమెరా దృశ్యాల్లో రికార్డయింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.25 గంటల వరకు ఆ హోటల్ లోనే ఉన్నాడు. ఆ తర్వాత తన స్కోడా కారులో బయటకు వచ్చిన భరత్, రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ఔటర్ రింగ్ రోడ్డుపై కొత్వాల్ గూడ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టి మృతి చెందాడు.