: సల్మాన్ 'బిగ్ బాస్'లో పాల్గొనాల్సిన వాడు... ఇలా అకస్మాత్తుగా వదిలెళ్లాడు: రవితేజ బాబాయి
గతంలో కొన్ని తప్పులు చేసినప్పటికీ, భరత్ రాజు తన పద్ధతి మార్చుకుని ప్రస్తుతం ఎంతో మంచిగా ఉంటున్నాడని, సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా, ప్రసారమయ్యే 'బిగ్ బాస్' షోలో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడని రవితేజ బాబాయి మూర్తి రాజు పేర్కొన్నారు. ఈ షో కోసం ఫిట్ నెస్ పెంచుకునేందుకు నిత్యమూ స్మిమ్మింగ్ చేస్తూ ఉన్నాడని తెలిపిన మూర్తి రాజు, శనివారం కూడా నోవాటెల్ లోని స్విమ్మింగ్ పూల్ లో రెండున్నర గంటల పాటు ఈత కొట్టి, వ్యాయామం చేసిన అలసటతోనే కారు ప్రమాదానికి గురై ఉంటాడని మీడియా ముందు విలపిస్తూ చెప్పారు.
40 సంవత్సరాల పాటు తమతో కలసి మెలసి వుండి, ఇప్పుడు నిర్జీవమైన సోదరుడిని చూడలేక రవితేజ, కన్న బిడ్డను చూడలేక రాజ్యలక్ష్మి అంత్యక్రియలకు హాజరు కాలేదని చెప్పారు. కాగా, మూర్తి రాజు దగ్గరుండి భరత్ రాజు అంత్యక్రియల ప్రక్రియను పర్యవేక్షించారు. తాను వయోవృద్ధుడైనందున, ఓ జూనియర్ ఆర్టిస్టుకు రూ. 1500 ఇచ్చి తలకొరివి పెట్టించినట్టు తెలుస్తుండగా, అందరూ ఉండి కూడా అనాధగా మారిన భరత్ రాజుపై సానుభూతి వెల్లువెత్తుతోంది. మరోవైపు సోదరుడు మరణించినా, కనీసం దగ్గరకు కూడా రాని రవితేజపై విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.