: 1 నుంచి భారీగా పెరగనున్న స్మాల్, మిడ్ సెగ్మెంట్ కార్ల ధరలు... ఇప్పుడు కొంటేనే మేలంటున్న నిపుణులు!
మరో వారం రోజుల్లో పన్ను సంస్కరణల్లో అగ్రగామిగా చెప్పుకుంటున్న జీఎస్టీ విధానం అమల్లోకి రానుండటంతో కార్ల ధరలు పెరగనున్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చిన తరువాత ఏ కార్ల ధరలు పెరుగుతాయి? ఏ కార్ల ధరలు తగ్గుతాయన్న విషయంలో ప్రజల్లో ఎన్నో సందేహాలు నెలకొని ఉన్నాయి. కాగా, జీఎస్టీ తరువాత బడ్జెట్ కార్లు, అంటే మధ్య తరగతి ప్రజలు ఆదరించే రూ. 5 లక్షల ప్రైస్ బ్యాండ్ పై ఉండే కార్ల ధరలు 3 నుంచి 5 శాతం మేరకు పెరగనున్నాయి. కారు ధరపై రూ. 15 వేల నుంచి రూ. 25 వేల వరకూ పెరగనుండటంతో, కారు కొనే ఆలోచనలో ఉన్నవారు ఇప్పుడే కొనుగోలు చేస్తే మేలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రస్తుతం మారుతి సుజుకి అందిస్తున్న ఆల్టో వంటి కార్లపై 25 నుంచి 27.5 శాతం వరకూ పన్నులుండగా, 1వ తేదీ తరువాత 29 శాతం పన్ను కట్టాల్సి వుంటుంది.
ఇక ప్రస్తుతం ఆల్టో, స్విఫ్ట్ లపై మారుతి సుజుకి రూ. 30 వేల వరకూ డిస్కౌంట్లను అందిస్తోంది. మారుతి సుజుకికి పోటీగా ఉన్న హ్యుందాయ్ ఎలైట్ ఐ20 నుంచి శాంతా ఫే మోడల్స్ వరకూ రూ. 25 వేల నుంచి రూ. 2.50 లక్షల వరకూ బెనిఫిట్స్ అందిస్తున్నాయి. వడ్డీ రేట్ల తగ్గింపు, ఉచిత ఇన్స్యూరెన్స్ తదితర ఆఫర్లను అందిస్తున్నాయి.
జీఎస్టీ అమలు తరువాత పరిస్థితి ఎలా ఉండనుందో పరిశీలిస్తే...
ఉదాహరణకు రెనాల్ట్ క్విడ్ ను తీసుకుందాం. దీని ధర రూ. 3,32,312 (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) ఉండగా, 26 శాతం పన్ను పరిధిలో ఉంది. 1వ తేదీ నుంచి 29 శాతం పన్ను చెల్లించాల్సి వుండటంతో రూ. 7,900 అదనంగా చెల్లించాల్సి వుంటుంది. ఇక హోండా సిటీ విషయానికి వస్తే, ప్రస్తుతం రూ. 10,12,797 (ఎక్స్ షోరూం, న్యూఢిల్లీ) ధరపై ఉన్న కారుపై 41.50 శాతం పన్ను ఉంది. జీఎస్టీ అమలు తరువాత 43 శాతం టాక్స్ చెల్లించాల్సి వుండటంతో, రూ. 10,735 అధికంగా చెల్లించక తప్పదు.
ప్రస్తుతం రూ. 7,76,000 ధరపై ఉన్న మారుతి సుజుకి డిజైర్ ను వారం తరువాత సొంతం చేసుకోవాలంటే, రూ. 7,97,300 చెల్లించాల్సి వుంటుంది. టయోటా ఫార్చూనర్ కావాలనుకుంటే మాత్రం వారం రోజులు ఆగితే మంచిది. ఎందుకంటే హై ఎండ్ కార్లపై పన్ను రూ. 50 వేల నుంచి రూ. 2.5 లక్షల వరకూ తగ్గుతుంది కాబట్టి. ఫార్చ్యూనర్ ప్రస్తుత ధర రూ. 31,85,480 ఉండగా, జీఎస్టీ అమలు తరువాత రూ. 1.18 లక్షల ధర తగ్గి రూ. 30,67,480కి దిగిరానుంది. మొత్తం మీద స్మాల్, మీడియం కార్ల ధరలు పెరగనుండగా, హై ఎండ్ కార్ల ధరలు దిగిరానున్నాయి.