: ముంద్రా యూపీఎంపీలో 51 శాతం వాటా రూ. 1 మాత్రమే: కొనేవారు రావాలంటున్న టాటా పవర్
గత కొంతకాలంగా తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన టాటా పవర్ సంస్థ, నష్టాలకు కారణమైన 4 వేల మెగావాట్ల ముంద్రా యూపీఎంపీ (అల్టా మెగా పవర్ ప్రాజెక్టు)లో 51 శాతం వాటాను కేవలం ఒక్క రూపాయికి విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటాను కొనుగోలు చేయాలని గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ కు టాటా పవర్ అధికారులు లేఖ రాశారు. ఈ లేఖ కాపీని గుజరాత్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి, విద్యుత్ మంత్రిత్వ శాఖకు, ప్రధాని ముఖ్య కార్యదర్శికి, కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్ కూ పంపించారు. ఈ లేఖలో రెండు ఆప్షన్స్ ను ప్రస్తావిస్తూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, లేకుంటే ఈక్విటీని కొనుగోలు చేసి ప్లాంటును నిర్వహించుకోవాలని కోరింది.
కాగా, ఈ ప్రాజెక్టును ఒక్క రూపాయికి విక్రయించినా, అది తమకెంతో లాభదాయకమని టాటా పవర్ భావిస్తోంది. ప్లాంటు నిర్వహణ పెను భారం కాగా, నష్టాల నుంచి కోలుకునేందుకు ప్రభుత్వమే ముందుకు రావాలని, 49 శాతం వాటాదారుగా, ప్లాంటుకు అవసరమైన అన్ని రకాల అవసరాలనూ తీర్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని ఈ లేఖలో అధికారులు పేర్కొన్నారు. 2008లో వేసిన అంచనా వ్యయాల ప్రాతిపదికన ఇప్పుడు ప్లాంటును నడిపించడం ఎలా సాధ్యమని టాటా సన్స్ బోర్డు ప్రశ్నిస్తూ, ముంద్రా ప్లాంటు విస్తరణకు పెట్టుబడులను అడ్డుకున్న వేళ, టాటా పవర్ ఈ లేఖను రాయడం గమనార్హం.