: 'రీల్ సీఎం' కానున్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య!
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రీల్ సీఎంగా మారనున్నారని కన్నడ దర్శకురాలు కవితా లంకేశ్ తెలిపారు. ‘సమ్మర్ హాలిడేస్’ పేరుతో తానొక సినిమాను నిర్మిస్తున్నానని, అందులో సీఎం పాత్రలో ఆయన నటించనున్నారని ప్రకటించారు. ఈ సినిమా ఇంగ్లీష్, కన్నడ భాషల్లో రూపొందుతోందని ఆమె తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన 80% షూటింగ్ పూర్తయిందని, కేవలం సీఎంపై చిత్రీకరించాల్సిన సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని, సీఎం ఎప్పుడు అపాయింట్ మెంట్ ఇస్తే అప్పుడే చిత్రీకరణ జరుపుతామని ఆమె తెలిపారు.
అభ్యంతరకర సన్నివేశాలు లేవన్న హామీ మీదే ఆయన నటించేందుకు అంగీకరించారని ఆమె తెలిపారు. దీనిపై సీఎం కార్యాలయం స్పందించింది. సిద్దరామయ్య కాలేజీ రోజుల్లో సరదాగా నటించేవారని, నటనపై ఆయనకు మక్కువ ఉందని, ఆ మక్కువతోనే ఆయన ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారని తెలిపారు. ఇందులో ఆయనది చిన్నపాత్ర అని తెలిపారు.