: కుంబ్లే స్థానాన్ని భర్తీ చేయడం కష్టసాధ్యం: వీరేంద్ర సెహ్వాగ్


టీమిండియా హెడ్ కోచ్ గా అనిల్ కుంబ్లే తప్పుకున్న అనంతరం సామాజిక మాధ్యమాల వేదికగా మాజీ ప్లేయర్లు, క్రికెట్ అభిమానులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా, టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఓ న్యూస్ ఛానెల్ తో మాట్లాడుతూ, కుంబ్లే ఆధ్వర్యంలో భారత క్రికెట్ జట్టు గొప్ప విజయాలు అందుకుందని, ఇప్పుడు, అతని స్థానంలో వచ్చేది ఎవరైనప్పటికీ, ఆ స్థానాన్ని భర్తీ చేయడం కష్టసాధ్యమని అభిప్రాయపడ్డాడు.

 కుంబ్లే హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన ఏడాది కాలంలోనే వెస్టిండీస్, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్ లు కైవసం చేసుకోవడంతో పాటు, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయాన్ని సెహ్వాగ్ ప్రస్తావించాడు. హెడ్ కోచ్ గా కుంబ్లే కోచింగ్ శైలిపై తాను ఎలాంటి కామెంట్లు చేయదలచుకోలేదని అన్నాడు. అయితే, టీమిండియాకు విదేశీ కోచ్ కంటే స్వదేశీ కోచ్ ఉండటమే మంచిదని సెహ్వాగ్ అభిప్రాయపడ్డాడు. కుంబ్లే కోచ్ గా ఉన్నప్పుడు తాను ఆడలేదని, కుంబ్లే తనకు సీనియర్ మాత్రమే కాదు, కెప్టెన్ గా కూడా వ్యవహరించిన విషయాన్ని సెహ్వాగ్ గుర్తు చేసుకున్నాడు.

  • Loading...

More Telugu News