: ఇక కటకటాల వెనక్కు కర్ణన్... బెయిల్ కు ససేమిరా అన్న సుప్రీంకోర్టు
సుమారు నెలన్నర పాటు అజ్ఞాతంలో ఉండి నిన్న కోవై (కోయంబత్తూరు)లో పోలీసులకు పట్టుబడిన కోల్ కతా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ ఇక జైలుకు వెళ్లక తప్పదు. ఆయన పెట్టుకున్న మధ్యంతర బెయిల్ పిటిషన్ ను కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు తిరస్కరించింది. దేశ న్యాయవ్యవస్థపై ఎంతమాత్రమూ నమ్మకం లేకుండా పారిపోయిన ఆయనపై దయ చూపించాల్సిన అవసరం ఏంటని ఈ సందర్భంగా న్యాయమూర్తి ప్రశ్నించారు.
కాగా, సుప్రీంకోర్టుకు ఎదురు నిలిచి, న్యాయమూర్తులకు సమన్లు పంపి, వారికి జైలు శిక్ష విధిస్తున్నట్టు చెప్పి, ఆపై కోల్ కతా నుంచి తమిళనాడుకు పారిపోయిన కర్ణన్, దేశ చరిత్రలో అజ్ఞాతంలో ఉండి పదవీ విరమణ చేసిన తొలి న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించిన నేపథ్యంలో కర్ణన్ ను నేడు పశ్చిమ బెంగాల్ పోలీసులు జైలుకు తరలించనున్నారు. ఆయనకు కోర్టు ధిక్కరణ కేసులో ఆరు నెలల జైలు శిక్ష పడగా, ఇప్పుడు పారిపోయిన కేసూ ఎదుర్కోవాల్సి వుంది.