: డీసీసీబీలకు గోల్డెన్ చాన్స్... పాత నోట్లు మార్చుకునేందుకు ఆర్బీఐ మరో అవకాశం
గత సంవత్సరం నవంబరులో రద్దయిన రూ. 500, రూ. 1000 నోట్లు తమ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్నాయని వాటిని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని పోస్టాఫీసులు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు మొరపెట్టుకోవడంతో, వాటిని మార్చుకునేందుకు మరో అవకాశాన్ని ఇస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. వచ్చే 30 రోజుల్లోగా రద్దయిన పెద్ద నోట్లను డిపాజిట్ చేసుకోవచ్చని, వీటిని ఏ రిజర్వ్ బ్యాంక్ కార్యాలయంలోనైనా జమ చేయవచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ అధికార నోటిఫికేషన్ వెలువరించింది. ఈ బ్యాంకుల ఖాతా క్రెడిట్ ద్వారా నోట్ల మార్పిడి విలువను తిరిగి పొందవచ్చని సూచించింది.
కాగా, నోట్ల రద్దు తరువాత కో-ఆపరేటివ్ బ్యాంకులు కూడా పాత నోట్లను డిపాజిట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆపై రద్దు గడువు ముగిసిన తరువాత, తమ వద్ద ఆర్బీఐకి జమ చేయకుండా మిగిలిన నోట్లు వందల కోట్లు ఉన్నాయని, వీటిని మార్చకుంటే, రైతు రుణాలకు ఇబ్బందులు కలుగుతాయని సహకార బ్యాంకుల యాజమాన్యాలు రిజర్వ్ బ్యాంకుకు వెల్లడించిన సంగతి తెలిసిందే. గతంలో ఇదే ప్రతిపాదనను నిరాకరించిన, రిజర్వ్ బ్యాంక్ ఇప్పుడు ఓ మెట్టు దిగి నోట్లను మార్చుకునే అవకాశాన్ని ఇచ్చింది.