: ఖతర్ సంక్షోభానికి తెరదించే యత్నం.. రంగంలోకి అమెరికా!
ఉగ్రవాదానికి ఊతమిస్తోందన్న ఆరోపణలతో ఖతర్‌తో గల్ఫ్ దేశాలు సంబంధాలు తెంచుకున్నాయి. సౌదీ అయితే సరిహద్దులను మూసివేసింది. పొరుగు దేశాలన్నీ సంబంధాలు తెంచేసుకోవడంతో ఖతర్ సంక్షోభంలో చిక్కుకుపోయింది. ఆహార నిల్వలు క్రమంగా తగ్గిపోయాయి. దీంతో కొన్ని దేశాలు నౌకలు, విమానాల ద్వారా ఆహార పదార్థాలు సరఫరా చేశాయి. అయితే తాజాగా ఖతర్‌లో నెలకొన్న సంక్షోభానికి చరమగీతం పాడేందుకు అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వం నడుంబిగించింది.
ఖతర్‌తో సంబంధాలను తెంచుకోవడం వెనక ఉన్న డిమాండ్లు ఏమిటో చెప్పాలని సౌదీ అరేబియాను కోరింది. అందుకు సంబంధించిన జాబితా ఇవ్వాలని సూచించింది. డిమాండ్లు ఏమిటో చెప్పకుండా పొరుగు దేశాన్ని దూరం పెట్టడం సరికాదని అమెరికా కార్యదర్శి టిల్లెర్‌సన్ అసహనం వ్యక్తం చేశారు. సౌదీ అరేబియా, బహ్రయిన్, ఈజిప్ట్, యూఏఈలు ‘మాయ’లో చిక్కుకుపోయాయని, సమస్య పరిష్కారం కోసం తమ డిమాండ్లు ఏమిటో వెల్లడించలేదని పేర్కొన్నారు. కాబట్టి అవేమిటో చెబితే సంక్షోభ పరిష్కారానికి ప్రయత్నిస్తామని వివరించారు.