: ప్రపంచమే మనతో మమేకం: ప్రధాని నరేంద్ర మోదీ
ఒకప్పుడు ఇండియాకు మాత్రమే పరిమితమైన యోగాను, ఇప్పుడు ప్రపంచమంతా ఆదరిస్తోందని, యోగాను ప్రపంచానికి అందించిన ఘనత భారతావనిదేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరం యోగా వేడుకలను 'ఆరోగ్యం కోసం యోగా' పేరిట నిర్వహిస్తుండగా, ఆయుష్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో లక్నోలోని రామాబాయ్ సభాస్థల్ లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న మోదీ ప్రసంగించారు.
యోగాతో ప్రపంచమంతా భారత్ తో మమేకమైందని వ్యాఖ్యానించిన ఆయన, శారీరక, మానసిక వికాసాన్ని సులువు చేసేందుకు యోగాసనాలు ఎంతో దోహదపడతాయని అన్నారు. గడచిన మూడేళ్లలో ఎన్నో దేశాల్లో యోగా శిక్షణా కేంద్రాలు ఆవిర్భవించాయని గుర్తు చేసిన ఆయన, ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో యోగాను భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగాలో పలు రకాల ప్రయోజనాలున్నాయని, ప్రతిరోజు యోగా చేయడం ద్వారా పరిపూర్ణ ఆరోగ్యంతో ఉండవచ్చని మోదీ అన్నారు. కాగా, ఈ కార్యక్రమంలో నిపుణుల పర్యవేక్షణలో వేలాది మంది ఔత్సాహికులు, మోదీ, యోగి తదితరులతో కలిసి పలు రకాల యోగాసనాలు వేశారు.