: ఐవైఆర్ కృష్ణారావు చెబుతున్నవన్నీ అబద్ధాలే: పరకాల ప్రభాకర్
ఐవైఆర్ కృష్ణారావు చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అపాయింట్ మెంట్ ఇవ్వలేదన్నది అసత్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ... సీఎం చంద్రబాబుని కృష్ణారావు మార్చి, ఏప్రిల్, మేలో కూడా కలిశారని అన్నారు. కృష్ణారావు చేస్తున్నది అనవసర వివాదమని అన్నారు. సామాజిక మాధ్యమం ద్వారా ఇలా చేయడం విపరీత ధోరణిగా కనపడుతోందని వ్యాఖ్యానించారు. ఆయన ఔచిత్యంతో కూడిన మాటలు మాట్లాడడం లేదని అన్నారు.
బ్రాహ్మణ కార్పోరేషన్ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ప్రభుత్వం ఒక కట్టుబాటు, పద్ధతితో పనిచేస్తోందని పరకాల ప్రభాకర్ అన్నారు. ఐవైఆర్ కృష్ణారావు చేసింది ప్రభుత్వ దృష్టిలో అత్యంత అభ్యంతరకరమని చెప్పారు. ఇంత అనుభవజ్ఞులైన కృష్ణారావు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదని అన్నారు. కృష్ణారావుపై తమకు గౌరవం ఉందని అన్నారు. ప్రభుత్వం బ్రాహ్మణ కార్పోరేషన్‌కు ఎన్నో నిధులు ఇస్తోందని చెప్పారు. అటువంటి ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏంటని అన్నారు. ఒక అంశంపై ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని అన్నారు. బ్రాహ్మణ కార్పోరేషన్ పై తీసుకున్న నిర్ణయాల మేరకే ముందుకు వెళుతున్నామని అన్నారు.