: మహేశ్ కి నాలుగేళ్లప్పుడే స్టార్ పుట్టాడని గుర్తించాం!: మంజుల
ఫాదర్స్ డే సందర్భంగా తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గురించి ఆయన కుమార్తె మంజుల మాట్లాడుతూ, తన తండ్రి నిజంగానే సూపర్ స్టార్ అని చెప్పింది. ఆయనలాంటి తండ్రి అందరికీ దొరకరని తెలిపింది. పిల్లలందర్నీ ఆయన సమానంగా చూస్తారని, చిన్నప్పటి నుంచి విలువలతో పెంచారని వెల్లడించింది. షూటింగ్ లో ఉండడంతో పిల్లలతో గడపడం కుదరడం లేదని ఫిర్యాదు రాకుండా ప్రతి శని, ఆది వారాలు మద్రాస్ లోని వీజీపీలో జరిగే షూటింగ్ లకు తమను తీసుకెళ్లేవారని చెప్పింది.
అక్కడ ఆయనకు ప్రత్యేకమైన రూం ఉండేదని, అక్కడే ఫ్యామిలీ మొత్తం గడిపేవారమని చెప్పింది. మహేశ్ కు నాలుగేళ్లప్పుడే ఇంట్లో స్టార్ పుట్టాడని గుర్తించామని చెప్పింది. అలా అని ఎవరినీ ప్రత్యేకంగా చూడలేదని, అందర్నీ సమానంగా చూడడం నాన్నకు మాత్రమే సాధ్యమని చెప్పింది. తన తండ్రి దగ్గర తనకు బాగా చనువు ఎక్కువని, ఏం కావాలన్నా ఆయనను అడిగి సాధించుకునే దానినని తెలిపింది. తన తండ్రి తనకు కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చారని మంజుల చెప్పింది.