: పాకిస్థాన్ లక్ష్యం చరిత్ర నెలకొల్పడం... భారత్ లక్ష్యం మ్యాచ్ నెగ్గడం!

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో భారత్, పాకిస్థాన్ జట్లు కాసేపట్లో తలపడనున్నాయి. మ్యాచ్ ఒక్కటే కానీ లక్ష్యాలు మాత్రం వేర్వేరు కావడం విశేషం. ఈ మ్యాచ్ లో విజయం సాధించడం ద్వారా చరిత్ర నెలకొల్పాలని పాక్ జట్టు కృతనిశ్చయంతో ఉంది. టీమిండియాకు ఇలాంటి భారీ లక్ష్యాలేమీ లేవు కానీ, ఈ మ్యాచ్ లో నెగ్గడం ద్వారా కోట్లాది భారతీయుల మనోభావాలు గాయపడకుండా చూడాలని భావిస్తోంది. ఐసీసీ ట్రోఫీల్లో భారత్ పై పాకిస్థాన్ ది పేలవమైన రికార్డు. ఐసీసీ అధికారిక టోర్నీలో భారత జట్టు పూనకం వచ్చినట్టు జూలు విదుల్చుతుంది. పరుగుల వరద పారిస్తుంది, నిప్పులు చెరిగే బంతులతో వికెట్లుతీసి పాక్ ను పెవిలియన్ పంపుతుంది.

 దీంతో ఐసీసీ టోర్నీల్లో భారత్ ది ఘనమైన రికార్డు. ఆది నుంచి భారత్ ది బలమైన జట్టు. గవాస్కర్, శ్రీకాంత్, వెంగ్ సర్కార్, రవిశాస్త్రి, సిద్ధూ, కిరణ్ మోరే, కపిల్ దేవ్, మనోజ్ ప్రభాకర్, అజహరుద్దీన్ వంటి దిగ్గజాలు 80, 90 మధ్య కాలం వరకు టీమిండియాను విజయ పథాన నిలిపితే....ఆ తరువాతి కాలంలో సచిన్, గంగూలీ, ద్రవిడ్, అజయ్ జడేజా, రాబిన్ సింగ్, కైఫ్, సెహ్వాగ్, గంభీర్, శ్రీనాధ్, వెంకటేష్ ప్రసాద్, కుంబ్లే, జహీర్ ఖాన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు జట్టును కాపుకాసి విజయాల బాటనడిపించారు. ప్రస్తుతం ధోనీ, కోహ్లీ, ధావన్, రోహిత్ వంటి ఆటగాళ్లు జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నారు. అపారమైన నైపుణ్యంతో పాటు విభిన్న శైలి వీరిసొంతం. ఈ నేపథ్యలో విజయం మరోసారి భారత్ వైపు మొగ్గు చూపుతోంది.

మరోవైపు రమీజ్ రాజా, జహీర్ అబ్బాస్, జావెద్ మియాందాద్, ఇమ్రాన్ ఖాన్, సలీం మాలిక్, వసీం అక్రమ్, ఆకిబ్ జావెద్, సయీద్ అన్వర్, వకార్ యూనిస్, ఇంజమాముల్ హక్, మొయిన్ ఖాన్, షోయబ్ అఖ్తర్, సక్లెయిన్ ముస్తాక్ ఇలా పలువురు దిగ్గజ ఆటగాళ్లు టీమిండియాపై విజయం సాధించేందుకు విశేషమైన కృషి చేశారు. అయినప్పటికీ విజయం మాత్రం భారత్ వైపే నిలబడింది. ఈ నేపథ్యంలో అనుభవలేమితో కొట్టుమిట్టాడుతున్న పాక్ జట్టు భారత్ పై ఫైనల్ లో ఎలా ఆడనుందన్నది ఆసక్తి రేపుతోంది. ఎప్పుడెలా ఆడుతారో తెలియని పాక్ జట్టుతో భారత్ కు ముప్పు పొంచి ఉంటుందని, అయితే విజయం మాత్రం టీమిండియాదేనని అంతా అభిప్రాయపడుతున్నారు.

More Telugu News