: బ్యూటీషియన్ శిరీష హత్య కేసులో శ్రావణ్ 'ఏ1'గా మారడం వెనుక అంత కథ ఉంది!
హైదరాబాదు ఫిల్మ్ నగర్ లో ఆత్మహత్యకు పాల్పడిన బ్యూటీషియన్ శిరీష కేసులో శ్రావణ్ ను ఏ1 నిందితుడిగాను, ఆర్జీఏ స్టూడియో ఓనర్, శిరీషతో అక్రమ సంబంధం నడిపిన రాజీవ్ ను ఏ2 నిందితుడిగాను పోలీసులు పేర్కొన్నారు. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది. ఆ వివరాల్లోకి వెళ్తే... నల్లగొండ జిల్లాకు చెందిన శ్రావణ్ విద్యార్ధి దశ నుంచే పోలీసులు, రాజకీయనాయకులతో స్నేహ సంబంధాలు నెరపడంలో సిద్ధహస్తుడు. ఎవరి అవసరం ఏమిటి? ఎవరితో ఎలా పని చేయించుకోవాలి? ప్రతిఫలంగా ఏమివ్వాలన్న విషయాలను బాగా ఒంట బట్టించుకున్నాడు. దీంతో బ్రోకర్ గా మారాడు.
పోలీస్ స్టేషన్లకు వచ్చే పలు సమస్యలు పరిష్కరిస్తూ బాధితులు, పోలీసులతో బంధాలు నెరిపాడు. దీనికి అండ కావాలి కనుక రాజకీయ నాయకుల వద్ద పలుకుబడిని సంపాదించుకున్నాడు. రిమాండ్ డైరీలో శ్రావణ్ గురించిన వివరాలు పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. అందులో శిరీష-రాజీవ్ ల అక్రమ సంబంధం కంటే... ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డితో శ్రావణ్ కు ఉన్న అనుబంధమే బలమైనది, సుదీర్ఘమైనది. ప్రభాకర్ రెడ్డి కానిస్టేబుల్ గా ఉన్ననాటి నుంచే ఆయనతో శ్రావణ్ కు స్నేహం ఉంది. ప్రభాకర్ రెడ్డితో పలు పనులు చేయించుకునే వాడు. ప్రతిఫలంగా ప్రభాకర్ రెడ్డి కోరుకున్నవి ఏర్పాటు చేసేవాడు. ఆయన ఎస్‌ఐ అయిన తరువాత ఇంకా పెద్ద పనులు చేయించుకోవడం మొదలు పెట్టాడు. అమ్మాయిలను ఎరవేసి ప్రభాకర్ రెడ్డిని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. గత ఏడాదికాలంలో మూడు సార్లు ఎస్‌ఐ వద్దకు అమ్మాయిలను పంపించినట్లు శ్రావణ్ పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. అతనికి 8 మంది పోలీసులు, ఇతర ప్రభుత్వ అధికారులతో స్నేహ సంబంధాలున్నాయని పోలీసులు తమ విచారణలో గుర్తించారు. వీరిందరి అవసరాలను గుర్తించి బాధితుల సమస్యలు పరిష్కరించేవాడు.
రాజీవ్, శిరీషల సంబంధం గురించి శ్రావణ్ కు ముందే తెలుసు. దీంతో, వివాదం నేపథ్యంలో తేజస్విని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో శిరీష సహాయం చేయాలని అతనిని కోరింది. ఇలాంటి అవకాశాల కోసమే ఎదురు చూసే శ్రావణ్... వేగంగా స్పందించి, ప్రభాకర్ రెడ్డి గురించి చెప్పి, అతనికి ఫోన్ చేసి, శిరీష తన మనిషని చెప్పాడు. పని కావాలని కోరాడు. ఇదంతా మంచి మనసుతోనే, పరిచయం కారణంగానే చేస్తున్నాడని శిరీష భావించింది. రాజీవ్ కూడా తోడుగా ఉండడంతో ఆమె శ్రావణ్ ను అనుమానించలేదు.
ఆ తరువాత ప్రభాకర్ రెడ్డికి ఆమె ఫోటోలు పంపి, సాయం చేస్తే పనికొస్తుందని తెలిపాడు. దీంతో శిరీష తనకు పనికొస్తుందని, పైగా ఆమె బ్యుటీషియన్, మేకప్ రంగాల్లో వుండడం వల్ల ఆమెకు తెలిసిన అమ్మాయిలు చాలామంది ఉంటారన్న ఆలోచన కిక్కిచ్చింది. అంతే కాకుండా వాట్స్ యాప్ లో శిరీష ఫొటోలు పంపిస్తూ, ఫొటోల్లో కన్నా బయట తను ఇంకా అందంగా ఉంటుందని శ్రావణ్ పేర్కొన్నాడు. దీంతో ప్రభాకర్ రెడ్డి వెంటనే జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశాడు. అయితే వారం తరువాత మాట్లాడేందుకు రావాలని విచారణాధికారి చెప్పడంతో శిరీష మరింత ఆందోళనకు గురైంది. ఎలాగైనా సమస్యను తొందరగా పరిష్కరించాలని కోరింది.
దీని కోసం కాచుకున్న శ్రావణ్ తన ప్రణాళిక అమలు చేశాడు. వారి ముందే ఫోన్ చేసి, మాట్లాడి ఫోన్ శిరీషకు ఇచ్చాడు. దీంతో శిరీష ‘‘సార్... నాకు సాయం చేయండి. ప్లీజ్’’ అంటూ ప్రభాకర్ రెడ్డిని బతిమాలుకుంది. దీంతో ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ‘‘ఓకె ఓకె ... సెటిల్ అవుద్ది. వర్రీ కాకండి. టెన్షన్ పడకండి’’ అని బదులిచ్చాడు. అనంతరం వారు ముగ్గురూ ఉన్నపళంగా కుకునూరుపల్లి బయల్దేరి వెళ్లారు. ఇక్కడ శిరీషది అమాయకత్వం, రాజీవ్ ది వదిలించుకునే ప్రయత్నం, శ్రావణ్ ది మోసం చేసే ముసుగు. దీంతోనే వారు మద్యం కొనుగోలు చేశారు. ఎస్సై దగ్గరకు వెళ్లిన తరువాత శ్రావణ్... 'తనని ఎస్సైతో మాట్లాడనీ' అని చెప్పి రాజీవ్ ను బయటకు తీసుకెళ్లాడు. దగ్గర్లో బ్రోతల్ హౌస్ లు ఉన్నాయని, ఎస్సై పురమాయిస్తాడంటూ రాజీవ్ ను సెట్ చేశాడు. తనకు శిరీషను వదిలించుకోవడం ముఖ్యం కనుక రాజీవ్ సులభంగానే శ్రావణ్ వలలో పడ్డాడు.
మరోపక్క, ఎస్‌ఐ ఎలాంటి జంకు లేకుండా ఆమెను లొంగదీసుకునే ప్రయత్నం చేశాడు. దీంతో తాను అలాంటిదానిని కాదని, శిరీష వేడుకుంది. అయినా ఎస్సై వెనక్కి తగ్గకపోవడంతో అరిచి గీపెట్టింది. దీంతో రాజీవ్ అక్కడికి చేరుకుని ఆమెపై దాడి చేశాడు. ఎస్సైతో ఆమె గడిపితే ఆమె క్యారెక్టర్ ను దెబ్బకొట్టి, ఇక ఆమెను తన జీవితం నుంచి తరిమేయొచ్చన్న ఆలోచనతో రాజీవ్ అలా చేశాడు. దీంతో ఆమెపై దాడికి తెగబడ్డాడు. శ్రావణ్ కూడా ఆమెపై దాడి చేశాడు. ఇలాంటి అంశాల్లో చేయితిరిగిన శ్రావణ్ ... హైదరాబాదు చేరుకున్న తరువాత తనకు భయంగా ఉందంటూ అక్కడి నుంచి జారుకున్నాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా శిరీష ఆత్మహత్య చేసుకోవడంతో కథ మలుపుతిరిగింది. పోలీసు విచారణలో వెలుగు చూసిన అంశాలివి. దీంతో శ్రావణ్ ను ఏ1 నిందితుడిగా, రాజీవ్ ను ఏ2గా పోలీసులు పేర్కొన్నారు. తేజస్వినికి ఎలాంటి ప్రమేయం లేకపోవడంతో ఆమెను పోలీసులు వదిలేశారు.