: రేపు అసలుసిసలు క్రికెట్ మజా... ఫైనల్లో పాక్ పై భారత్ గెలవాలని ముస్లింల ప్రార్థనలు
ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2017లో రేపు అసలుసిసలైన పోరు జరగనున్న విషయం తెలిసిందే. డిపెండింగ్ ఛాంపియన్ భారత్‌తో దాయాది పాకిస్థాన్ జట్టు తలపడనుంది. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన పాకిస్థాన్.. ధాటిగా ఆడి సెమీస్‌లో ఇంగ్లండ్ జట్టుని చిత్తుగా ఓడించి ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్ దశ మ్యాచ్‌లో టీమిండియా చేతిలో ఓడిన పాకిస్థాన్‌తోనే ఇండియా మరోసారి ఆడనుంది. పాక్ జట్టు ఎప్పుడు ధాటిగా ఆడుతుందో ఎప్పుడు చతికిలపడుతుందో చెప్పలేం. ఇరు జట్ల బలబలాలు చూస్తే పాక్ కన్నా టీమిండియానే బలంగా కనిపిస్తున్నప్పటికీ పాక్‌ను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయలేమని టీమిండియా అంటోంది.
కాగా, రేపటి మ్యాచ్‌లో భారత్ గెలవాలని ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఇందులో ముస్లిం మత పెద్దలు, యువకులు, మహిళలు అంతా కలిసి పాల్గొన్నారు. రంజాన్ మాసం కావడంతో ప్రస్తుతం ముస్లింలు ఉపవాస దీక్షలో ఉన్న విషయం తెలిసిందే. ఫైనల్‌లో తమ దేశమే గెలవాలని కోరుకుంటూ వారు దేవుడిని ప్రార్థించారు.