: జల్సా అన్ లిమిటెడ్....సరికొత్త ఆఫర్ తో రంగంలోకి రిలయన్స్
జియో రాకతో టెలికాం సంస్థల వ్యవహారశైలిలో మార్పులు సంభవించాయి. డేటా ఆఫర్ల పేరిట నెలకొన్న పోటీ నేపథ్యంలో ఎక్కువ టారిఫ్ ను తక్కువ ధరకు అందిస్తూ వినియోగదారులపై ధరాభారాన్ని తగ్గించాయి. మార్కెట్ లో గణనీయమైన వాటా దక్కించుకునేందుకు జియో, ఎయిర్ టెల్, బీఎస్ఎన్ఎల్, ఐడియా, రిలయన్స్ కమ్యూనికేషన్స్ వంటి సంస్థలు సరికొత్త ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యర్థి సంస్థల పోటీని తట్టుకునేందుకు రిలయన్స్ కమ్యూనికేషన్స్ సంస్థ సరికొత్త ఆఫర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.
‘జల్సా అన్ లిమిటెడ్’ పేరుతో పోస్ట్ పెయిడ్ యూజర్ల కోసం ఈ ఆఫర్ తెచ్చినట్టు ఆర్ కాం తెలిపింది. 333 రూపాయలతో ఈ ఆఫర్ తీసుకునే పోస్టు పెయిడ్ వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాల్స్ తో పాటు 30 జీబీ 4జీ డేటా వినియోగించుకోవచ్చని తెలిపింది. అలాగే ఏ ఇతర నెట్ వర్క్ కైనా 1000 నిమిషాల ఉచిత లోకల్, మరో 1000 ఉచిత ఎస్టీడీ నిమిషాలు, 100 ఎస్సెమ్మెస్ లు ఫ్రీ అని తెలిపింది. ఇప్పుడే ఈ ఆఫర్ ను సబ్ స్క్రైబ్ చేసుకుంటే ఏడాదిపాటు ఈ ఆఫర్ పొందవచ్చని తెలిపింది.