: వేగంగా వెళుతోన్న ఆ కారులోంచి బ్యూటీషియన్ శిరీష దూకే ప్రయత్నం చేసింది: సీపీ మహేందర్ రెడ్డి
ఈ నెల 13న తెల్లవారు జామున 2.30 గంటలకు కుకునూర్ పల్లిలోని ఎస్సై ప్రభాకర్ రెడ్డి రూంలో నుంచి బయటకు వచ్చిన రాజీవ్, శ్రవణ్‌లు శిరీషను ఎక్కించుకుని వెళ్లిపోయారని సీపీ మహేందర్ రెడ్డి అన్నారు. అనంతరం శిరీష కారులో అరుస్తూ, విలపిస్తూ ఉందని అన్నారు. కారు వేగంగా వెళుతోన్న సమయంలో శిరీష కారు డోర్ తెరచి అందులోంచి దూకే ప్రయత్నం చేసిందని అన్నారు. రాజీవ్ ఆమె జుట్టును పట్టుకొని ఆపాడని చెప్పారు. కారులో హైదరాబాద్ కు వచ్చేవరకు శిరీష గొడవ పడుతూనే ఉందని వివరించారు.
అదేరోజు తెల్లవారు జామున శ్రవణ్ నగర శివారులో కారు దిగిపోయాడని రాజీవ్, శిరీష షేక్ పేట చేరుకున్నారని చెప్పారు. రాజీవ్ కారును పార్క్ చేస్తుండగా శిరీష స్టూడియోలోకి వెళ్లిందని అన్నారు. అనంతరం రూం లాక్ చేసుకుని చున్నీతో ఉరి వేసుకుని మృతి చెందిందని చెప్పారు. అనంతరం ఎలాగోలా డోర్ తెరచిన రాజీవ్.. ఆమె ఫ్యాన్‌కి వేసుకున్న చున్నీని విప్పడానికి ప్రయత్నించి విఫలమై ఓ చాకుతో దాన్ని కోసేసాడని, అనంతరం శ్రవణ్‌కి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాడని సీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అనంతరం రాజీవ్ అంబులెన్స్ కు ఫోన్ చేశాడని, అక్కడకు చేరుకున్న వైద్యులు ఆమె చనిపోయిందని చెప్పారని అన్నారు.
అనంతరం పోలీసులు వచ్చారని, ఈ విషయం తమ దృష్టికి వచ్చిన తరువాత పోలీసులు.. శిరీష్ భర్త సతీష్ చంద్రకి చెప్పారని, ఆయన 7 గంటలకి అక్కడకు వచ్చాడని అన్నారు. తన భార్య ఆత్మహత్యచేసుకోదని అనుమానం ఉందని సతీష్ చంద్ర చెప్పారని అన్నారు. దాని బట్టి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు. రాజీవ్, శ్రవణ్‌లను కస్టడీలోకి తీసుకున్నామని అన్నారు. విచారణలో నిందితులు పలు విషయాలు చెప్పారని అన్నారు. మొదట కుకునూర్ పల్లి వెళ్లిన విషయాన్ని వారు చెప్పలేదని, అనంతరం చెప్పారని తెలిపారు.