: ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు ఆదర్శంగా నిలిచిన ఓ మసీదు
కేరళలోని ఓ ప్రముఖ మసీదు ప్రజల శ్రేయస్సు కోణంలో ఓ చక్కని నిర్ణయం తీసుకుని అందరికీ ఆదర్శనీయంగా నిలిచింది. వజక్కాడ్ ప్రాంతంలోనే అతిపెద్దదైన వాలియా జుమా మసీదు రోజులో ఒక్కసారి మాత్రమే లౌడ్ స్పీకర్ల ద్వారా అజాన్ (ప్రార్థన) వినిపించాలని నిర్ణయించింది. అంతేకాదు, ఇదే ప్రాంతంలోని మరో 17 మసీదులు కూడా జుమా మసీదు తరహాలోనే ముందుకు రావడం విశేషం. మసీదులో నిత్యం ఐదు కాలాల్లో ప్రార్థనలు చేయడం ఆనవాయితీ. ప్రతీ సమయంలోనూ లౌడ్ స్పీకర్ ద్వారా ప్రార్థనలు బయటకు వినిపిస్తుంటారు. అయితే, శబ్ద కాలుష్యంపై ఫిర్యాదులు పెరిగిపోతున్న క్రమంలో రంజాన్ మాసంలో రోజుకు ఒక్కసారే అజాన్ వినిపించాలని జుమా మసీదు నిర్ణయానికి వచ్చింది. అంతేకాదు మతపరమైన ఇతర కార్యక్రమాలకూ లౌడ్ స్పీకర్లను వినియోగించడాన్ని నిలిపివేయాలని నిర్ణయంచడం విశేషం.