: కన్న కూతురుని పాము కరుస్తుంటే వీడియో తీసి ఆనందించిన తల్లి.. నెటిజన్ల మండిపాటు!
తల్లి ప్రేమను మించింది ప్రపంచంలో ఏదీ లేదని అంటారు. తన ప్రాణాలు పణంగా పెట్టయినా తన బిడ్డలను కాపాడుకుంటుంది తల్లి. కానీ ఫ్లోరిడాలో ఓ మహిళ అమ్మతనానికే మచ్చ తెచ్చేలా ప్రవర్తించింది. తన కన్న కూతుర్ని పాము కరుస్తుంటే ఎంజాయ్ చేస్తూ తన సెల్ ఫోన్ లో వీడియో తీసింది. అంతేకాదు, ఆ తరువాత ఆ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. అది చూసిన నెటిజన్లు ఆమెపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో ఆ వీడియోను ఆమె తొలగించింది. అయితే, ఈ వీడియో వైరల్‌గా మారి పోలీసులకు తెలియడంతో ఆ తల్లిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆమెపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
తాను కావాలనే పాముతో తన కూతురును కరిపించానని ఆమె చెబుతోంది. పాములంటే పిల్లలకు భయం ఉండకూడదని, ఆ భయాన్ని పోగొట్టడానికే తాను ఇలా చేశానని వ్యాఖ్యలు చేసింది. ఆ పాముతో తాను కరిపించుకున్నానని, తన కొడుకుని కూడా ఆ పాము కరిచిందని చెబుతోంది. ఆమెపై పోలీసులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈ కేసులో అసలు నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.