: నిద్రిస్తుండగా పాపను కాటేసిన పాము... ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి
విజయనగరం జిల్లా సాలూరు మండలం కురుకూటిలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో అందరూ నిద్రపోతుండగా పాప ఏడవడంతో తల్లిదండ్రులు లేచి లైటు వేసి చూడడంతో వారికి పాము కనిపించింది. ఆ పాము తమ చిన్నారిని కరిచిందని గమనించిన తల్లిదండ్రులు స్థానికులకు ఈ విషయం చెప్పడంతో వారు వచ్చి పామును పట్టుకున్నారు.
మరోపక్క, ఆ పాపను ఆసుపత్రికి తరలించేలోపే ఆమె ప్రాణాలు కోల్పోయింది. రాత్రి వరకు తమ ముందు ఆడుతూ పాడుతూ కనిపించిన తమ చిన్నారి పాముకి బలైపోవడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆ పాప తల్లిదండ్రుల పేరు వంతల సీతయ్య, నీలమ్మ. వారు కూలి పనిచేసుకుంటూ తమ పిల్లలను పెంచుతున్నారు. వారికి ఈ పాపతో పాటు ఇద్దరు కొడుకులు ఉన్నారు.