: 16 నుంచి పెట్రోలు, డీజిల్ కొనం, అమ్మం: తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్

పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలను, కొనుగోలును ఈ నెల 16 నుంచి నిరవధికంగా బంద్‌ చేస్తామని తెలంగాణ పెట్రోలియం డీలర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రాజీవ్‌ అమరం ప్రకటించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పెట్రోల్, డీజిల్ ధరలను రోజువారీగా సవరించాలన్న విధానం వల్ల పెట్రోల్‌ బంకుల యజమానులపై తీవ్ర ప్రభావం పడుతుందని అన్నారు. దేశ వ్యాప్తంగా రోజుకు 4 వేల లీటర్ల పెట్రోల్, డీజిల్‌ విక్రయించే బంకులు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు.

ఈ బంకుల డీలర్లు ఇంధనం కొనుగోలు చేసేటప్పుడు 12 వేల లీటర్ల వరకు తీసుకుంటారని, ఈ విధానంతో వీరు తీవ్రంగా నష్టపోతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అంతే కాకుండా దేశంలోని 75 శాతం పంపుల్లో ఆటోమిషిన్‌ సౌకర్యం లేదని, అందువల్ల రోజువారీ ధరల హెచ్చుతగ్గుల విధానాన్ని అమలు చేయడం కష్టమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు నేడు, రేపు ఆలిండియా పెట్రోలియం అసోసియేషన్‌ ప్రతినిధులు పెట్రోలియం మంత్రిత్వ శాఖ, చమురు కంపెనీలతో చర్చలు జరపనున్నారని ఆయన తెలిపారు. ఈ చర్చలు విఫలమైతే తాము పెట్రోలు, డీజిల్ కొనుగోళ్లు, అమ్మకాలను నిలిపేస్తామని ఆయన చెప్పారు.

More Telugu News