: ముఖ్యమంత్రి నిరాహార దీక్ష ముగిసింది....రైతులే దీక్ష ముగించమన్నారట!
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చేపట్టిన దీక్ష ముగిసింది. రైతుల ఆందోళన ముగించి, శాంతి నెలకొనే వరకు నిరవధిక నిరాహారదీక్ష చేపడతానని ప్రకటించి, భోపాల్ లోని దసరా మైదానంలో నిరాహార దీక్షకు దిగిన ముఖ్యమంత్రి 24 గంటలు కూడా గడవక ముందే మాండసౌర్ లో రైతులు నిరాహారదీక్ష ముగించమన్నారని చెబుతూ ముగించారు. మంత్రులు, రైతు సంఘాల నేతలు ముఖ్యమంత్రికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
ఈ సందర్భంగా రైతుల సమస్యలు పరిష్కరిస్తానని, రైతులపై కాల్పులు జరిపిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాగా, రుణమాఫీ అమలు చేయాలని, పంటలకు కనీస మద్దతుధర కల్పించాలని చెబుతూ మాండసౌర్ లో రైతులు ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు రైతులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు చోటుచేసుకున్నాయి.