: సోషల్ మీడియాలో కోటి మందిని ఆకట్టుకున్న గాయని... ఆమె ప్రత్యేకత తెలిస్తే నివ్వెరపోతారు.. వీడియో చూడండి!
ప్రతిభ ఎవరి సొత్తూ కాదు. సామర్థ్యం, సాధనతో సొంతమయ్యే ప్రతిభ ఎవరికైనా పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తుంది. అలాంటి ప్రతిభ గలిగిన యువతి సోషల్ మీడియాలో అందర్నీ ఆకట్టుకుంటోంది. దీని వివరాల్లోకి వెళ్తే... అమెరికా టీవీ రియాలిటీ షో... 'అమెరికాస్ గాట్ టాలెంట్' సీజన్ 12 ఆడిషన్స్ జరుగుతున్నాయి. నలుగురు జడ్జిలు తమ తీర్పుతో ఆడిషన్స్ లో పాల్గొంటున్న ఔత్సాహికుల ప్రతిభను అంచనా వేసి, మార్కులు వేస్తారు. మాండీ హార్వీ అనే యువతి కూడా ఈ ఆడిషన్స్ లో పాల్గొంది. వేదికపైకి మాండరీన్ లాంటి గిటార్ పట్టుకుని వచ్చిన హార్వీ వెంట మరో యువతి ఉంది. దీంతో జడ్జిలు ఆమెను పరిచయం చేసుకోవాలని సూచించారు. దీంతో హార్వీ వెంట వచ్చిన యువతి సైగ చేసింది. వెంటనే హార్వీ సమాధానం చెప్పింది. తన పేరు మాండీ హార్వీ అని, తాను పాట పాడాలనుకుంటున్నానని చెప్పింది.
మరి వెంట వచ్చిన యువతి ఎవరు? ఎందుకు వచ్చింది? అని అడగడంతో ఆమె మళ్లీ మరొకసారి సైగ చేసింది. దీంతో హార్వీ సమాధానం చెబుతూ, తనకు 18వ ఏట దురదృష్టవశాత్తు వినికిడి లోపం వచ్చిందని, తనకు ఏమీ వినిపించదని, అయితే నాలుగవ ఏట నుంచే సంగీత సాధన చేయడంతో పాడగలనని, ఎదుటి వారి స్పందన, భావాలు, వేదిక నుంచి వచ్చే శబ్దాల వైబ్రేషన్స్ తో వాటిని ఆస్వాదించగలనని తెలిపింది. ఇతరులు చెప్పేది అర్థం చేసుకునేందుకు ఆమె తనకు ఆ మాటలను సైగలుగా ట్రాన్స్ లేట్ చేస్తుందని చెప్పింది.
దీంతో ముగ్ధులైన జడ్జిలు ఆమెను పాడమని చెప్పారు. తాను సొంతంగా రాసి ట్యూన్ కట్టుకున్న పాటను పాడి వినిపించింది. ఆమె పాట అంతానికి వచ్చే సరికి వేదిక ముందున్న వారంతా స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వగా...కఠినమైన జడ్జిగా పేరున్న సైమన్ కోవెల్ గోల్డెన్ బజర్ నొక్కాడు. అంతే, ఆ గాయని నిల్చున్న ప్రాంతమంతా బంగారు రేపర్ల వర్షం కురిసింది. దీనికి అంతా ముగ్ధులయ్యారు. ఈ సీజన్ లో గోల్డెన్ బజర్ గెల్చుకున్న యువతిగా హార్వీ నిలిచింది. ఈ వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది వైరల్ అవుతోంది. ఇప్పటికే దానిని కోటి మందికిపైగా చూడడం విశేషం...ఆ వీడియో మీరు కూడా చూడండి.