: ఎయిర్ పోర్టులోనే బస్సులో నిద్రపోయి... ఫ్లైట్ మిస్సయ్యాడు... అందర్నీ కంగారు పెట్టాడు!


ప్రయాణంలో కొంతమందికి హాయిగా నిద్రపట్టేస్తుంది. బస్సు కుదుపులు ఊయలలా, ఆ శబ్దం జోలపాటలా వినిపిస్తోందా? అన్నంత గాఢంగా నిద్రపోతారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో చోటుచేసుకున్న ఈ ఘటన గురించి వింటే, అయ్యో పాపం అనిపించకమానదు. ఈ వివరాల్లోకి వెళ్తే... వినయ్‌ ప్రేమ్‌ అనే వ్యక్తి జూన్‌ 4న సాయంత్రం 6.30 గంటలకు ముంబయి నుంచి బెంగళూరు వెళ్లేందుకు ఇండిగో విమానం (6ఈ 799) లో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు. గంటముందుగా ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. దేశీయ టెర్మినల్‌ 1 వద్ద బోర్డింగ్‌ పాస్‌ తీసుకున్నాడు. ఎయిర్ పోర్ట్ నుంచి విమానం చేరేందుకు ఇతర ప్రయాణికులతో కలిసి సర్వీసు బస్సెక్కి వెనుక సీట్లో కూర్చున్నాడు.

అంతే, కేవలం ఐదు నుంచి పదినిమిషాల సమయం పట్టే ఆ ప్రయాణంలో నిద్రకు ఉపక్రమించాడు. అతనిని ఎవరూ పట్టించుకోలేదు. ఆఖరుకి బస్సు డ్రైవర్ కూడా పట్టించుకోలేదు. విమాన సిబ్బంది కూడా చెకిన్ అయిన ప్రయాణికుడు వచ్చాడా? లేదా? సీట్లో కూర్చున్నాడా? లేదా? అని సరిచూసుకోలేదు. విమానం వెళ్లిపోయింది. బస్సులో వినయ్ ప్రేమ్ హాయిగా నిద్రపోయారు. అనంతరం మరొక బస్సు డ్రైవర్ వచ్చి, వెనుక సీట్లో ఎవరో నిద్రపోతున్నారని సదరు బస్సు డ్రైవర్ కు చెప్పడంతో విషయం వెలుగు చూసింది. వినయ్ ప్రేమ్ ఆ బస్సులో సుమారు ఆరు గంటలపాటు నిద్రపోయాడు. దీంతో విమానాశ్రయ భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై స్పందించేందుకు ఇండిగో అధికారులు నిరాకరించారు.

  • Loading...

More Telugu News