: ప్రజాగ్రహానికి గురైన సౌందర్య ఉత్పత్తుల యాడ్... మీరూ చూడండి!
4,000 కుపైగా పర్సనల్ కేర్ స్టోర్లు, 1,000 కిపైగా ఫార్మసీలు, చైనా, కొరియా, ఉక్రెయిన్ లలో ఎంతో మంది కస్టమర్లు కలిగిన సౌందర్య ఉత్పత్తుల సంస్థ వాట్సన్ మలేసియా ఆసియాలోనే అతిపెద్ద సంస్థల్లో ఒకటిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అయితే, తమ ప్రోడక్ట్స్ కు ప్రాచుర్యం కల్పించేందుకు తయారు చేసిన ఓ యాడ్ ఆ సంస్థ పరువును గంగలో కలిపేసింది. ఆ యాడ్ ను గురువారం ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేయగా, అది వైరల్ అయింది. దీంతో నెటిజన్లు ఆ యాడ్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. ‘ఈ ప్రకటన జాతివిక్షకు పరాకాష్ట. ఇన్నాళ్లూ వాట్సన్ ఉత్పత్తులు వాడినందుకు సిగ్గుపడుతున్నా’ అని కొందరు.. ‘నల్లగా ఉండటాన్ని లోపంగా చూపిన మీరు నిజంగా చీకట్లో బతుకుతున్నారు’ అని ఇంకొందరు వాట్సన్ సంస్థను ఛీకొట్టారు.
అన్ని వర్గాల నుంచి ఛీత్కారాలు ఎదురుకావడంతో వెనక్కితగ్గిన వాట్సన్ మలేసియా జరిగిన నష్టాన్ని గుర్తించి ఆ వీడియోను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.... మలేసియాలోని ఓ యువరాజు రోజూ తన కలలోకి వచ్చే ప్రేయసి ఎవరో తెలుసుకునేందుకు దేశంలోని యువతులను తన దర్బారుకు పిలిపిస్తాడు. అలా రాజప్రాసాదానికి చేరిన ముద్దుగుమ్మలంతా ఆడిపాడి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారు. చివర్లో ఒక అమ్మాయి పాడిన పాటకు యువరాజు ముగ్ధుడవుతాడు. ‘నువ్వే నా కలల రాణివం’టూ ఉప్పొంగిపోయి ముఖంపై ముసుగు తొలగించి, ప్రపంచానికి ఆమె అందాన్ని చూపించమంటాడు. ఆమె ముసుగు తీస్తుంది.
ఆమెను చూసిన రాజు గావుకేక పెడతాడు. నల్లగా ఉన్న ఆమెను చూసి దర్బారులోని అందగత్తెలు ఇతరులు అంతా గుసగుసలాడుకుంటారు. ఇంతలో మరొక యువతి తానే యువరాణినని సంబరపడుతుంది. అంతలో అక్కడ ఒక యువతి ప్రత్యక్షమై రాజును ఆకట్టుకుంటుంది. ‘నేను నల్లదాన్ని కాను.. స్వచ్ఛమైన అందగత్తెని. నీ (యువరాజు) నిజాయతీని పరీక్షించడానికే అలా వచ్చా’నని చెబుతుంది. 14 నిమిషాల నిడివి గల ఈ యాడ్ లో రంగుకు ప్రాధాన్యమిచ్చి మహిళలను అవమానపరిచారంటూ విమర్శలు రావడంతో దానిని రద్దు చేస్తున్నట్టు వాట్సన్ మలేసియా ప్రకటించింది.