: నాపై సొంత పార్టీలోనే కుట్ర జరుగుతోంది: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ బీజేపీపై ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోనే తనపై కుట్ర జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కు లేఖ రాశారు. నియోజకవర్గంలో తనకు తెలియకుండానే పార్టీ కమిటీలు వేస్తున్నారని... తనకు వ్యతిరేకంగా పని చేసిన వారికి పదవులు కట్టబెట్టారని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తనను పార్టీకి అడ్డంకిగా భావిస్తే... పార్టీ నుంచి తొలగించాలని కోరారు. అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు కూడా రాజాసింగ్ ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర బీజేపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయని... దీని వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటూ అమిత్ షా దృష్టికి ఆయన తీసుకెళ్లారు.