: ఇండియాలో అత్యంత దారుణంగా 4జీ స్పీడ్: ట్రాయ్
కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో కోట్లాది మందికి చేరువైన 4జీ, ఇప్పుడు వినియోగదారులకు చుక్కలు చూపుతోంది. అత్యంత వేగంగా బట్వాడా కావాల్సిన డేటా, ప్రపంచ సగటుతో పోలిస్తే, మూడో వంతు కన్నా తక్కువ స్థాయిలో సాగుతోందని, డౌన్ లోడ్ వేగం కేవలం సెకనుకు 5.1 మెగాబైట్లేనని ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) వెల్లడించింది. సగటు 3జీ వేగంతో పోలిస్తే, ఈ వేగం నామమాత్రమేనని వెల్లడించింది.
జియో ఉచిత ఆఫర్లతో డేటా సర్వీస్ ట్రాఫిక్ శరవేగంగా పెరగడంతో డేటా స్పీడ్ గణనీయంగా పడిపోతోందని ట్రాయ్ తయారు చేసిన 'ఓపెన్ సిగ్నల్' నివేదిక వెల్లడించింది. జియో ప్రవేశించిన తరువాత ఇతర టెల్కోలైన ఎయిర్ టెల్, వోడాఫోన్, ఐడియా తదితర సంస్థలు కూడా 4జీ సేవల్లోకి దిగడంతో డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా డేటా వేగం పుంజుకోలేదని తెలిపింది. పొరుగున ఉన్న పాకిస్థాన్, శ్రీలంక దేశాలతో పోలిస్తే, ఇండియాలో 4జీ వేగం చాలా తక్కువగా ఉందని, ఈ జాబితాలో భారత్ ది 74వ స్థానమని తెలిపింది. ప్రపంచంలో 4జీ వేగం సగటున 16.2 ఎంబీపీఎస్ ఉండగా, సింగపూర్ తొలి స్థానంలో ఉందని వెల్లడించింది. ఇండియాలో సగటు డేటా వాడకం నెలకు 236 మెగాబైట్ల నుంచి 884 మెగాబైట్లకు పెరిగిందని ఈ నివేదిక పేర్కొంది.