: రవిచంద్రన్ అశ్విన్ తో గొడవలున్నాయి కానీ..: కోహ్లీ
భారత కీలక స్పిన్ బౌలర్ అశ్విన్ తో తనకు గొడవలు ఉన్నాయని అంగీకరించిన కోహ్లీ, అవి మైదానంలో జట్టు అనుసరించే వ్యూహాల విషయంలో మాత్రమేనని, తుది జట్టును ఎంపిక చేసే సమయంలో ఎన్నడూ కాదని చెప్పాడు. బౌలింగ్ ఎలా చేయాలన్న విషయంలో అతని సొంత ప్రణాళికలతో మైదానంలోకి వచ్చే అశ్విన్ తో తనకు తరచూ విభేదాలు వస్తుంటాయని చెప్పాడు. అతను తెలివైనవాడని అంటూనే, ఆ తెలివితేటల వల్లే కొన్నిసార్లు సమస్యలు ఏర్పడతాయని చెప్పాడు. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాక్ తో జరిగిన మ్యాచ్ లో తుది జట్టులో అశ్విన్ కు స్థానం లభించలేదన్న సంగతి తెలిసిందే. టాప్ బౌలర్ అయినప్పటికీ, అశ్విన్ ను పక్కన బెట్టడం ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్నదేనని, ఆటలో ఎంతో ప్రొఫెషనల్ గా ఉండే అశ్విన్ కు తన నిర్ణయంపై అభ్యంతరాలు రాలేదని చెప్పాడు. జట్టు కూర్పును, సమీకరణాలను అర్థం చేసుకున్నాడని చెప్పాడు.