: పాపం మేకకు ఆకలేసిందట.. యజమాని కరెన్సీ నోట్లను తినేసింది!
అనగనగా ఓ మేక. దానికి బాగా ఆకలయింది. ఆకులు, అలములు దొరుకుతాయేమోనని ఆశగా చుట్టు పక్కల వెతికింది. కానీ, ఏమీ దొరకలేదు. ఇంతలో, తన యజమాని ప్యాంటు జేబులో రంగురంగుల కాగితాలు కనిపించాయి. ఈ కాగితాలు తిని అయినా కాస్త కడుపునింపుకుందామని... వాటిని లాగించేసింది. కాసేపటి తర్వాత ఈ విషయాన్ని యజమాని గమనించాడు. కానీ, అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. ప్యాంటు జేబులో ఉన్న రూ. 66 వేల విలువైన 2 వేల రూపాయల నోట్లను మేక తినేసిందని తెలిసి... బావురుమన్నాడు. ఈ ఘటన యూపీలోని కనౌజ్ జిల్లాలో జరిగింది.
తన ఇంట్లో జరుగుతున్న పనుల కోసం ఇటుకలు కొనేందుకు గానూ సర్వేష్ కుమార్ అనే రైతు తన ప్యాంటు జేబులో ఈ డబ్బును పెట్టుకున్నాడు. మేక ఆ నోట్లను తింటుండటం చూసి... వాటిని బయటకు లాగే ప్రయత్నం చేశాడు. రెండు నోట్లు మాత్రమే బయటకు వచ్చాయి. అవి కూడా బాగా చిరిగిపోయి ఉన్నాయి. స్నానం చేసేందుకు ప్యాంటును పక్కన పెట్టానని... పేపర్లు తినే అలవాటు ఉన్న మేక, డబ్బంతా లాగించేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే, ఈ మేక కూడా తన బిడ్డలాంటిదేనని... అందుకే బాధ పడటం మినహా, దాన్ని ఏమీ చేయలేకపోయానని చెప్పాడు. ఈ వార్త ఈనోటా, ఆనోటా పాకిపోయింది. ప్రస్తుతం ఆ మేక సెలబ్రిటీ అయిపోయింది. కొందరు దాంతో సెల్ఫీలు కూడా దిగుతున్నారు.