: ఆస్ట్రేలియాకు ఇంగ్లండ్ అడ్డు... రెండు మ్యాచ్ లను వరుణుడు అడ్డుకుంటే మాత్రం అదృష్టం!
ఇంగ్లండ్ లో జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీలో గ్రూప్ ఏ నుంచి సెమీస్ కు ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకోగా, రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొని వుంది. నాలుగు జట్లూ తలా రెండేసి మ్యాచ్ లు ఆడగా, తామాడిన రెండు మ్యాచ్ లనూ వరుణుడు అడ్డుకున్న స్థితిలో సున్నా రన్ రేటుతో రెండు పాయింట్లతో ఉన్న ఆస్ట్రేలియా, పటిష్ఠమైన ఇంగ్లండ్ తో తన చివరి లీగ్ మ్యాచ్ ని ఆడనుంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఖాయంగా సెమీస్ కు వెళ్తాయి. ప్రస్తుత పరిస్థితిలో ఇంగ్లండ్ ను సొంత జట్టుపై ఓడించడం ఆస్ట్రేలియాకు కాస్తంత కష్టమే.
ఇక ఈ గ్రూప్ లో మిగిలిన మరో మ్యాచ్ న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య జరగనుండగా, ఈ మ్యాచ్ ని న్యూజిలాండ్ గెలిచినప్పటికీ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మ్యాచ్ ఫలితంపైనే న్యూజిలాండ్ సెమీస్ ఆశలు ఆధారపడి వున్నాయి. ఆ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతేనే న్యూజిలాండ్ జట్టు, బంగ్లాదేశ్ పై గెలిచి 3 పాయింట్లతో సెమీస్ కు వెళుతుంది. ఇక ఆస్ట్రేలియాకు ఉన్న మరో ఆశ... ఈ రెండు మ్యాచ్ లనూ వరుణుడు అడ్డుకోవడం. అదే జరిగితే మూడు పాయింట్లు ఉండే ఆస్ట్రేలియా సెమీస్ కు వెళుతుంది. ఏదిఏమైనా గ్రూప్-ఏ సమీకరణాలు క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠను పెంచుతున్నాయి.