: చాంపియన్స్ ట్రోఫీ: సెమీస్ కు వెళ్లిన తొలి జట్టు ఇంగ్లండ్!
చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. గత రాత్రి కార్డిఫ్ లోని సోఫియా గార్డెన్స్ లో జరిగిన గ్రూప్ ఏ మ్యాచ్ లో న్యూజిలాండ్ తో తలపడిన ఇంగ్లండ్ జట్టు, అన్ని విభాగాల్లో సమష్టిగా రాణించి సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టులో రూట్ (65 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 64 పరుగులు), బట్లర్ (48 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 61 పరుగులు), హేల్స్ (62 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 56 పరుగులు), స్టోక్స్ (53 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 48 పరుగులు) రాణించడంతో 49.3ఓవర్లలో 310 పరుగులు చేయగలిగింది.
311 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టులో వన్ డౌన్ బ్యాట్స్ మన్ విలియమ్సన్ 87 పరుగులతో రాణించినా, మరెవరూ తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోవడంతో 44.3 ఓవర్లకే 223 పరుగులకు ఆలౌటైంది. దీంతో 2 మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు సాధించిన ఇంగ్లండ్ జట్టు సెమీస్ కు చేరుకోగా, మరో ప్లేస్ కోసం ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, న్యూజిలాండ్ జట్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.