: వివాహాల్లో ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్... కేరళలో కొత్త నిబంధనలు!
కేరళ రాష్ట్రంలో జరిగే వివాహాల్లో ఇకపై ప్లాస్టిక్ వస్తువుల వినియోగానికి చెక్ పెట్టనున్నారు. ఈ మేరకు కఠిన నిబంధనలతో కూడిన ‘గ్రీన-ప్రొటోకాల్’ ను తీసుకువచ్చేందుకు కేరళ ప్రభుత్వం సిద్ధమైంది. చివరకు, థర్మోకోల్ తో చేసే అలంకరణ వస్తువులను వినియోగించడానికి కూడా వీలు లేదు. ఈ నిబంధన ప్రకారం పెళ్లిళ్లలో స్టీలు, గాజు గ్లాసులు, కప్పులు, ప్లేట్లు, ఇతర పాత్రల వినియోగాన్ని మాత్రమే అనుమతిస్తారు. ఈ ప్రొటోకాల్ ప్రకారం పెళ్లి చేసుకున్న జంటలకు ‘హరిత వివాహ పత్రం’ ఇవ్వనున్నారు. కాగా, కేరళలో పారిశుద్ధ్య వ్యవహారాలను పర్యవేక్షించే నోడల్ ఏజెన్సీ సుచిత్వ మిషన్’ ఈ ప్రొటోకాల్ ను కన్నూర్, ఎర్నాకుళం, కొల్లం, అలప్పుజ జిల్లాల్లో ప్రస్తుతం అమలు చేస్తోంది. ఆ తర్వాత కేరళ రాష్ట్ర మంతటా ‘గ్రీన-ప్రొటోకాల్’ ను అమలు చేయనున్నారు.