: ప్రభాస్ తో డీల్ కుదుర్చుకున్న జియోనీ
బాహుబలి చిత్రంతో ఇంటర్నేషనల్ రేంజ్ కి ఎదిగిన ప్రభాస్ ఇమేజ్ ని క్యాష్ చేసుకునేందుకు జియోనీ నిర్ణయించుకుంది. ఇండియాలో తమ బ్రాండ్ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు పెంచుకునేందుకు ప్రభాస్ తో డీల్ కుదుర్చుకుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన జియోనీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ వోహ్రా, ప్రభాస్ తో డీల్ తమకెంతో సంతోషాన్ని కలిగించిందని అన్నారు. ఆయనతో డీల్ వెనకున్న ఆర్థిక గణాంకాలను వెల్లడించేందుకు నిరాకరించిన వోహ్రా, ప్రభాస్ చేరికతో, తమ అమ్మకాలు మరింతగా పెరుగుతాయన్న నమ్మకం ఉందని తెలిపారు. ఐదేళ్ల క్రితం ఇండియాలో కాలుమోపిన సంస్థ, ఇప్పటికే 1.25 కోట్ల మంది కస్టమర్లకు చేరువైందని వెల్లడించారు. కాగా, జియోనీకి ఇప్పటికే ఇండియాలో క్రికెటర్ విరాట్ కోహ్లీ, ఆలియా భట్, శ్రుతి హాసన్ తదితరులు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న సంగతి తెలిసిందే.