: పెరిగిపోతున్న శబ్ద కాలుష్యం.. సోను నిగమ్ ‘పాట’ అందుకున్న హైదరాబాదీలు!
హైదరాబాదీలు ఇప్పుడు బాలీవుడ్ నేపథ్య గాయకుడు సోను నిగమ్ పాటందుకున్నారు. పెరిగిపోతున్న శబ్దకాలుష్యంతో ఇబ్బంది పడుతున్న నగర ప్రజలు ఇప్పుడు దానిని తగ్గించే పనిలో పడ్డారు. తెల్లవారుజామున మసీదులు, గుళ్లూ గోపురాల్లోని లౌడ్ స్పీకర్లు నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తుండడంతో వాటికి పుల్‌స్టాప్ పెట్టేందుకు చేతులు కలుపుతున్నారు.
మసీదుల నుంచి తెల్లవారుజామున వచ్చే ఆజాన్‌పై సోను నిగమ్ ట్విట్టర్‌లో విమర్శలు కురిపించాడు. తెల్లవారుజామున ఉండే నిశ్శబ్ద వాతావరణాన్ని అవి పాడు చేస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో దేశవ్యాప్తంగా లౌడ్ స్పీకర్ల అంశం చర్చనీయాంశం అయింది. ‘‘ఆజాన్ అనేది ప్రార్థన మాత్రమే. దానిని రోజుకు మూడునాలుగుసార్లు లౌడ్‌స్పీకర్ల ద్వారా వినిపించాల్సిన అవసరం లేదు. అది అర్థం లేని చర్య. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి’’ అని మక్కామసీదు మతపెద్ద రిజ్వాన్ ఖురేషీ పేర్కొన్నారు.
50 డెసిబుల్స్‌కు మించి శబ్దం రాకుండా ఉండాలన్న నిబంధనలపై పోలీసులు లౌడ్ స్పీకర్లకు అనుమతి ఇస్తున్నా, అవి అమలు కావడం లేదు. దీంతో శబ్ద కాలుష్యం విపరీతంగా పెరిగిపోతోంది. సోను నిగమ్ విమర్శల పుణ్యమాని ఇప్పుడు నగర వాసులు ఆయన పల్లవి అందుకున్నారు. విద్యానగర్ సహా పలు ప్రాంతాల్లోని కాలనీ పెద్దలు లౌడ్ స్పీకర్లకు పుల్‌స్టాప్ పెట్టాలని భావిస్తున్నారు. అందులో భాగంగా మసీదులు, ఆలయాల అధికారులతో చర్చలు జరుపుతున్నారు.
తాము మత సంబంధ విషయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవడం లేదని, వాటి వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వారికి వివరించాలన్నదే తమ ప్రయత్నమని విద్యానగర్‌లోని టీఆర్‌టీ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ రాజశేఖర్‌రావు తెలిపారు. ఈ ప్రాంతంలో పది మసీదులు, ఆలయాలు ఉన్నాయని, వాటి లౌడ్ స్పీకర్లు తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గణేశ్ చతుర్థి లాంటి సందర్భాల్లో రాత్రుళ్లు కూడా పెద్ద పెద్ద శబ్దాలతో హోరెత్తిస్తున్నారని, అది సరికాదని అన్నారు. ఇకనైనా వీటికి చరమగీతం పాడి మత విలువలను కాపాడాలని కోరారు. కాగా, సోను నిగమ్ పిలుపుతో ఉత్తరప్రదేశ్ మొరాదాబాద్ జిల్లాలోని తిరియాడీన్ గ్రామ ప్రజలు లౌడ్ స్పీకర్లు తీసివేసి సౌండ్ పొల్యూషన్‌కు చెక్ పెట్టి ఆదర్శంగా నిలిచారు.