: ఏపీ సీఎం చంద్రబాబుపై పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఏపీలో బ్లాక్ డేగా జరుపుకోవాలని వ్యాఖ్యానించిన ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణలోని పెద్దపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. టీఎస్ ముస్లిం పొలిటికల్ జేఏసీ, కేటీఆర్ యువసేన ఆధ్వర్యంలోని బృందం పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మను ఈ రోజు కలిశారు. తెలంగాణ రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులను కించపరిచేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో చంద్రబాబును తెలంగాణలో అడుగుపెట్టనివ్వమని హెచ్చరించారు. ఈ సందర్భంగా సింధూశర్మ మీడియాతో మాట్లాడుతూ, న్యాయనిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.