: ప్రేమించిన అమ్మాయిని గోదావరిలోకి తోసేసిన యువకుడు.. రక్షించిన మత్స్యకారులు!
ప్రేమించిన అమ్మాయిని గోదావరి నదిలోకి తోసేసి పారిపోయాడో యువకుడు. ఆ యువతి నీళ్లలో మునిగిపోతుండడాన్ని గమనించిన కొందరు మత్స్యకారులు ఆమెను రక్షించి ఆసుపత్రిలో చేర్చడంతో ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గండి అలివేణి (26) తమ ప్రాంతంలో బట్టలషాపులో పనిచేసే నాసిక శ్రీనివాస్ అనే యువకుడిని ప్రేమించింది. వారిద్దరు ఐదేళ్లుగా చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నారు.
ఆ యువతిని నిన్న శ్రీనివాస్ పుదిచ్చేరిలోని యానాంకు తీసుకువచ్చాడు. యానాం-ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధిపై హాయిగా నడుచుకుంటూ వెళ్లారు ఆ జంట. అక్కడే రాత్రి 2.30 గంటల వరకు గడిపారు. ఇక తనను పెళ్లి చేసుకోవాలని ఆ యువతి కోరింది. దీంతో ఆ ప్రేమికుడికి చిర్రెత్తుకొచ్చింది. తనను పెళ్లి చేసుకోవాల్సిందేనంటూ అలివేణి ఒత్తిడి చేసింది. దీంతో శ్రీనివాస్ ఆమె తలపై కొట్టాడు. అనంతరం గొంతు నులిమి వంతెనపై నుంచి గౌతమీ గోదావరి నదిలోకి తోసేశాడు. అనంతరం ఆమె తెచ్చుకున్న సెల్ఫోన్, హ్యాండ్బ్యాగ్ తీసుకుని ఆ యువకుడు పారిపోయాడు. దీనిని గమనించిన మత్స్యకారులు ఆమెను రక్షించారు.