: సీఆర్పీఎఫ్ దాడిలో నలుగురు ఉగ్రవాదులు హతం
జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో నలుగురు ముష్కరులను సీఆర్పీఎఫ్ దళాలు ఈ రోజు మట్టుబెట్టాయి. బంధిపోరా జిల్లాలోని సంబల్ సీఆర్పీఎఫ్-45 బెటాలియన్ క్యాంపుపై తెల్లవారుజామున 3.45 గంటల సమయంలో దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించారు. సెంట్రీ పోస్ట్ పై కాల్పులు మొదలు పెట్టి లోపలికి చొరబడేలోపే సీఆర్పీఎఫ్ బలగాలు స్పందించి ప్రతిదాడికి దిగాయి. ఉదయం 6.15 గంటల వరకు ఈ పోరు కొనసాగింది. నలుగురు ఉగ్రవాదులు మరణించినట్టు, ఆత్మాహుతి దాడి విఫలం చేసినట్టు అధికారులు వెల్లడించారు. సంఘటనా స్థలం నుంచి తుపాకులు, గ్రేనేడ్లను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.