: పిల్లలను ఎండలో హింసించారు.. చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టకూడదు?: పార్ధసారధి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన నవ నిర్మాణ దీక్షపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కె.పార్థసారధి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ప్రభుత్వ నిస్సహాయతను, చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి నవ నిర్మాణ దీక్ష పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల ఉపన్యాసాలను వినిపించడానికే దీక్ష పేరుతో మహిళలను, పిల్లలను మండుటెండలో కూర్చోబెట్టారని ఆరోపించారు. అది పిల్లలను ఎండలో హింసించడమే అవుతుందని చంద్రబాబుపై కేసు ఎందుకు పెట్టకూడదని ఆయన నిలదీశారు. భవిష్యత్తులో బంగారు భవిష్యత్తు ఉందంటూ చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలో చంద్రబాబు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఓవైపు టీడీపీ నేతలకు దీక్షలో ఏసీలు, టెంట్ లు ఉన్నాయని, మరోవైపు మహిళలు, పిల్లలకు అటువంటి సౌకర్యాలేమీ కల్పించలేదని ఆయన ఆరోపించారు.