: నాకో న్యాయం.. వారికో న్యాయమా?: ‘శివసేన’పై రోజా ఆగ్రహం


ప‌విత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమల శ్రీ‌వారి స‌న్నిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ ఇటీవ‌ల శివ‌సేన కార్య‌క‌ర్త‌లు చేసిన వ్యాఖ్య‌ల‌పై రోజా స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... 'తిరుప‌తిలో నేను మాత్రమే రాజ‌కీయాల‌పై మాట్లాడుతున్నానా?' అని ప్ర‌శ్నించారు. గ‌తంలో చంద్ర‌బాబు నాయుడు, అచ్చెన్నాయుడు వంటి ఎంతో మంది తిరుమ‌ల‌పై రాజకీయాల గురించి మాట్లాడార‌ని ఆమె అన్నారు. దేవినేని ఉమా మహేశ్వరావు నాలుగు రోజుల ముందే శ్రీవారి సన్నిధికి వచ్చి రాజకీయాలపై మాట్లాడారని ఆమె అన్నారు.

శివ‌సేన వాళ్ల‌కి తాను చెప్పేది ఒక్క‌టేన‌ని, తాను హిందూ సంప్ర‌దాయాల‌ను గౌర‌విస్తాన‌ని రోజా అన్నారు. తన‌కు భ‌క్తి కాస్త ఎక్కువేన‌ని అన్నారు. గుళ్ల‌ను కూల్చేసి ఆ స్థ‌లాల్లో బాత్‌రూంలు క‌ట్టిన చంద్ర‌బాబు నాయుడిని కూడా శివ‌సేన వారు నిల‌దీసి ఉంటే తాము సంతోషించేవారమ‌ని అన్నారు. టీటీడీ బోర్డులో ఎంతో మంది దొంగ‌లు దొరికిపోయార‌ని, ఆ బోర్డులో లిక్కరు మాఫియా వాళ్లు కూడా ఉన్నార‌ని రోజా అన్నారు. ఇంత‌ మందిని ప్ర‌శ్నించ‌ని శివ‌సేన త‌న‌ను మాత్ర‌మే టార్గెట్ చేసింద‌ని అన్నారు. తనను విమ‌ర్శించాల‌న్న ఆలోచ‌న నిజంగా శివ‌సేన‌కే వ‌చ్చిందా?  వేరే వాళ్ల ప్రోత్సాహంతో చేస్తున్నారా? అని ఆమె ప్ర‌శ్నించారు. తిరుమ‌ల కింద ఎన్నో బెల్టుషాపులు ఉన్నాయ‌ని ఆమె ఆరోపించారు. నిజంగా హిందూ ధ‌ర్మాన్ని కాపాడ‌డ‌మంటే తన‌ని మాత్ర‌మే టార్గెట్ చేయ‌డం కాద‌ని ఆమె అన్నారు. అందరినీ ప్రశ్నించాలని, ముందు గుళ్ల‌ను కూల్చేస్తోన్న చంద్ర‌బాబు నాయుడి లాంటి వారిని అడ్డుకోవాల‌ని ఆమె సూచించారు.      

  • Loading...

More Telugu News