: కుంబ్లే సమస్య.. టీమిండియా ఆటగాళ్లను కలవనున్న గంగూలీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య సమస్య ఉత్పన్నమైన నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియా జట్టుతో భేటీ కానున్నాడు. లండన్ లోని ఓ హోటల్ లో జట్టు ఆటగాళ్లను దాదా కలవనున్నాడు. ఈ సందర్భంగా తన మిత్రుడు కుంబ్లేకి సంబంధించి వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నాడు. హెడ్ కోచ్ ను ఎంపిక చేసే ముగ్గురు సభ్యుల అడ్వైజరీ కమిటీలో టెండూల్కర్, లక్ష్మణ్ లతో పాటు గంగూలీ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఒకవైపు ఛాంపియన్స్ ట్రోఫీ జరుగుతుండగా... హెడ్ కోచ్ కోసం బీసీసీఐ నోటిఫికేషన్ ఇవ్వడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనిపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, నిబంధనల మేరకే బీసీసీఐ వ్యవహరించిందని చెప్పారు. బీసీసీఐ నిర్ణయం కోహ్లీ, కుంబ్లేల మధ్య అంతరాన్ని మరింత పెంచిందనే ఆరోపణలను సన్నీ ఖండించారు.