: కోయంబత్తూరు వీధుల్లో గజరాజు బీభత్సం... నలుగురి మృతి
అడవిలో నుంచి దారితప్పి పారిపోయి, కోయంబత్తూరు నగరంలోకి వచ్చిన ఓ గజరాజు, ఎటెళ్లాలో తెలియక బీభత్సం సృష్టించగా, ఓ బాలిక సహా నలుగురు మరణించారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. నగర పరిధిలోని గణేశపురం, వెల్లలూరు ప్రాంతాల్లో ఏనుగు ప్రజలపై దాడికి దిగింది. ఏనుగు దాడి చేయడంతో గాయత్రి (12), పీ పళనిస్వామి (73), బీ నాగరత్నం (50), జ్యోతిమణి (68) ప్రాణాలు కోల్పోయారు. బుధవారం రాత్రి ఈ ఏనుగు సమీపంలోని అడవుల నుంచి వచ్చిందని అధికారులు తెలిపారు. దీన్ని తిరిగి మదుక్కారై అడవుల్లోకి తరిమేందుకు రెండు స్పెషల్ టీములను నియమించామని, దీని వయసు 20 నుంచి 25 ఏళ్లు ఉండవచ్చని పేర్కొన్నారు. ఇప్పటికీ ఏనుగు నివాస ప్రాంతాలలోనే తిరుగుతూ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.