: సంగారెడ్డిలో చరిత్ర సృష్టించిన రాహుల్ గాంధీ.. ఇందిరను గుర్తుచేసుకున్న స్థానికులు!
ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గురువారం సంగారెడ్డి ప్రజలను నాలుగు దశాబ్దాల వెనక్కి తీసుకెళ్లారు. తెలంగాణ ప్రజాగర్జన సభ సందర్భంగా ఇందిరను గుర్తు చేశారు. సరిగ్గా 38 ఏళ్ల క్రితం 1979లో అదే గ్రౌండ్‌లో రాహుల్ నానమ్మ ఇందిరా గాంధీ సభ నిర్వహించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు, పార్టీ కేడర్, స్థానికులు నాటి సభ గురించి ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఇందిర, రాహుల్ సభలకు ఉన్న పోలికల గురించి చర్చించుకోవడం కనిపించింది.
జనతా పార్టీ హవాతో 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయింది. దీంతో 1979లో ఇందిరాగాంధీ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. మెదక్‌లో ప్రస్తుతం రాహుల్ సభ జరిగిన చోటే భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఫలితంగా 1980 ఎన్నికల్లో మెదక్ లోక్ సభ స్థానంలో విజయదుందుభి మోగించిన ఇందిర బంపర్ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చారు. సరిగ్గా నాలుగు దశాబ్దాల తర్వాత ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అప్పట్లానే ఉంది. 2014 ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ ఆ తర్వాత జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లోనూ పరాజయం పాలైంది. రాహుల్ సభకు హాజరైన వారిలో చాలామంది స్థానికులు నాటి ఇందిర సభను గుర్తు చేస్తూ, నాడు ఇందిరలో కనిపించిన ఆవేశం, ఉత్సాహం, మాట తీరు నేడు రాహుల్‌లోనూ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు.